జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

సంగీత దర్శకుడు మరియు నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ను ఉత్తమ నటుడు అవార్డు వరించింది. సంగీతదర్శకత్వం, నటన అంటూ రెండు పడవలపైనా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌. ఈయన నటుడిగా ఇటీవల వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంచుకుంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య బాలా దర్శకత్వం వహించిన నాచియార్‌ చిత్రంలో చాలా భిన్నమైన పాత్రను సమర్థవంతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇటీవల సర్వం తాళమయం చిత్రంలో నటించారు. ప్రముఖ ఛా యాగ్రాహకుడు రాజీవ్‌మీనన్‌ దర్శకత్వం వ హించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందించారు. చిత్రం పలువురి ప్రశంసలను అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శంపబడింది. కాగా ఈ చిత్రంలో నటనకుగానీ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ప్రోవోక్‌ మేగజైన్‌ ఉత్తమ నటుడు అవార్డుతో సత్కరించింది.ఈ అవార్డుల వేడుక బుధవారం రాత్రి చెన్నైలో జరిగింది. ఈ వేదికపై అవార్డును అందుకున్న జీవీ.ప్రకాశ్‌కుమార్‌ చిత్ర దర్శకుడు రాజీవ్‌మీనన్‌కు తన ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. సంగీతప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జీవీకి జంటగా అపర్ణా బాలమురళీ నటించింది. నెడుముడి వేణు, వినీత్, కుమరవేల్‌ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రం ఇసైజ్ఞానం మణిదరిన్‌ పిరప్పు పార్తు వరువదిలై అనే కథ నుంచి తీసుకున్న పాయింట్‌తో రూపొందించబడింది. సర్వం తాళమయం చిత్రం గత ఫిబ్రవరిలో విడుదలైంది. కాగా జపాన్‌లో ఇటీవల జరిగిన టోక్యో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఆ దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన సినీ ప్రముఖుల నుంచి విశేష ఆదరణను పొంది ప్రశంసలు అందుకుంది. కాగా ప్రోవోక్‌ మేగజైన్‌ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్‌ను సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. జీవీ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.