ఒక్కొక్కరి జీవితం ఒక్కో సమయంలో యూటర్న్ తీసుకుంటుంది. ఎప్పుడు ఎలా ఎవరి జీవితం మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలా ఇప్పుడు నటుడిగా ఎంతో ఫేమస్ అయిన జయప్రకాష్ సినీ కెరీర్ నాగార్జున వల్లే ప్రారంభమైందట. జయ జానకీ నాయక, సరైనోడు వంటి సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. తాజాగా ఇప్పుడు కపటధారి సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జయప్రకాష్ మాట్లాడాడు.
నాగార్జున వల్లే నా కెరీర్ మారిపోయింది. 95,96లో సిసింద్రీ అనే సినిమా విడుదలైంది. నేను చెన్నైలో ఉన్నాను. నా ఫ్రెండ్ ఒకరు ఆ సినిమా చూద్దామని అన్నాడు. అలా చిత్తూరులో సిసింద్రీ అనే సినిమాను చూశాను. ఆ సినిమా చూశాను.. అందులో హీరో ఎవ్వరూ లేరు.. ఓ క్యూట్ లిటిల్ బాయ్ అని అర్థమైంది. చిన్న పిల్లాడితో సినిమా అనే కాన్సెప్ట్ ఎక్కడైనా వర్కవుట్ అవుతుందని అనుకున్నాను.
అలా నాగార్జున దగ్గరకు వెళ్లి సిసింద్రీ తమిళ్ డబ్బింగ్ రైట్స్ కొన్నాను. తమిళ్‌లో సిసింద్రీని డబ్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా నా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు సినిమాలతో ఎలాంటి సంబంధం లేని నేను అలా సిసింద్రీ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా ఇండస్ట్రీలోనే ఉన్నానంటూ నాటి విషయాను గుర్తు చేసుకున్నాడు జయప్రకాష్. ఇక కపటధారి సినిమా ప్రతీ సీన్ ఎంగేజింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.