‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. తీవ్ర గాయాలు, కారణం

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. తీవ్ర గాయాలు

వినోద్ అలియాస్ వినోదిని గా పాపులరైన జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ పై హైదరాబాద్ లో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే, అతని ఇంటి ఓనర్.. వ్యక్తిగత కక్షలతో దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న మిత్రులు హుటాహుటిన అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.దాడి ఘటనపై వినోద్‌ కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి ఓనరే తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు .అందుకు కారణం వినోద్ పోలీస్ లకు, మీడియాకు తెలియచేసారు.

వినోద్ చెప్పినదాని ప్రకారం…. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు. సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు.

రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.