హీరో సామ్యంలో నిర్మాత అంటే వడ్డీకి అప్పు తెచ్చేవాడు అని అర్థం. స్టార్ హీరోలే సర్వస్వం ఇపుడు. తన సినిమా దర్శకుడిని, నిర్మాతను నిర్ణయించేది హీరోనే. హీరోల్ని చూసే జనం థియేటర్ కి వస్తారు! అన్నదానిని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు. అందుకే ఇటీవల పలువురు హీరోలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సినిమాకి నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు. తమతో భాగస్వామ్య నిర్మాతలకు లాభాలను పంచడం .. ఫైనాన్షియర్లుగా కూచోబెట్టడం తప్ప వారిని గౌరవించే సాంప్రదాయం కూడా లేనే లేదు.
కానీ తనదైన మాయాజాలం .. తెలివైన ఎత్తుగడలతో సినిమా వ్యాపారాన్ని పరుగులు తీయించిన మేధావి అల్లు అరవింద్. ఆ రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోలతో సినిమాలు తీసారాయన. గీతా ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించి అందులో ఎన్నో బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు. చిరంజీవికి కెరీర్ ని ఇచ్చిందే ఆయన.
తన కెరీర్‌లో దిగ్గజ నిర్మాతలతో కలిసి పనిచేసిన మెగాస్టార్ చిరంజీవికి గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్ వంటి సొంత మనుషుల బ్యానర్లు అంటే అభిమానం. కె.ఎస్.రామారావు – దానయ్య వంటి ఇతరులకు అవకాశాలు ఇచ్చినా వారంతా ఆప్తులే అయ్యారు. అయితే ఇంటి బ్యానర్లలో సినిమాలు అంటే ఆ ఉత్సాహమే వేరు. అయితే తన పొలిటికల్ కెరీర్ ముగిశాక.. తిరిగి టాలీవుడ్ లో రెండో ఇన్నింగ్స్ లో అడుగు పెట్టాక సీన్ మొత్తం మారిపోయింది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే చిరు వరుసగా మూడు చిత్రాలు చేస్తే అందులో ఒక్కటీ అల్లు అరవింద్ కి లేకుండా పోయింది. మెగాస్టార్ తో సినిమా కోసం అరవింద్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. కానీ అవకాశం రాలేదు. ఖైదీ నెం 150, సైరా, ఆచార్య చిత్రాలకు చరణ్ మాత్రమే నిర్మాత. అతడు బయటి నిర్మాతల్ని కలుపుకుని సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్యకు కొణిదెల బ్యానర్ తో నిర్మాణ భాగస్వామి నిరంజన్ రెడ్డి జాయిన్ అయ్యారు.
ఇదే కాదు.. మరో బయటి బ్యానర్ కి చిరు తాజాగా సంతకం చేశారు. వరుసగా అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న మైత్రి మూవీ మేకర్స్‌తో ఓ సినిమాకి బాస్ ఓకే చెప్పారట. `వెంకీ మామ` ఫేం బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్. ప్రీప్రొడక్షన్ పూర్తయిందట.
కేవలం చిరంజీవి మాత్రమేనా.. ఇండస్ట్రీలో అగ్ర హీరోలంతా ఇంచుమించు ఇలానే చేస్తున్నారు. మహేష్.. పవన్ సహా పలువురు సొంత సినిమాలను సహనిర్మాతలతో కలిసి చేస్తున్నారు. తమ స్నేహితులను భాగస్వాములుగా చేసుకోవాలని ప్రధాన నిర్మాతకు సూచిస్తున్నారు. కుదరదంటే గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే చిరంజీవి లాంటి అగ్ర హీరో ఇలా చేస్తే తప్పేమీ కాదు కానీ.. సొంత బ్యానర్లను కాదనుకుని బావమరిది అరవింద్ ని కాదనుకుని వేరే బ్యానర్లకు సినిమాలు చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది.