ఆ నలుగురి గుప్పిట్లో సినీ పెద్ద?
గడిచిన రెండేళ్ల కాలంలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తానున్నానని ముందుకొచ్చారు. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తర్వాత మళ్లీ అంతటి పవర్ ఫుల్ జెంటిల్మన్ ఎవరున్నారు? అన్న చర్చకు ఆయన జవాబివ్వాలని ప్రయత్నిస్తున్నారు. సినీరంగంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఆయనను కలుస్తున్నారు. చిరు పెద్దన్న పాత్రను పోషిస్తూ ఎన్నో పరిష్కారాలు చూపిస్తున్నారు.
ఇంతకుముందు మూవీ ఆర్టిస్టుల సంఘం లొల్లిని చల్లార్చేందుకు మెగాస్టార్ చేయని ప్రయత్నం లేదు. ఎంతో సౌమ్యంగా ఆ వివాదానికి చెక్ పెట్టారు చిరు. ఎట్టకేలకు ఆ వివాదం సద్ధుమణిగింది. అనంతరం సినిమాల రిలీజ్ ల విషయంలోనూ ఆయన పరిష్కారం చూపే దిశగా సూచనలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం కరోనా అల్లకల్లోలం నేపథ్యంలో సినీకార్మికుల బతుకులపై అందరికంటే ముందుగా ఆలోచించి కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించి నిత్యావసరాల్ని అందిస్తున్నారు. ఆయన ముందు చూపునకు ఎందరో ప్రశంసలు కురిపించారు. ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన ఆలోచన ఇది.
మహమ్మారీ వల్ల షూటింగులు ఆగిపోతే రిలీజ్ లు ఆగిపోతే కార్మికుల బతుకులు తెల్లారిపోయే పరిస్థితి ఉందని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించారు. నేరుగా ముఖ్యమంత్రులు కేసీఆర్- వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు. పరిష్కారం కనుగొన్నారు. షూటింగులకు అనుమతులు లభించాయి. ఈ కష్ట కాలంలో అన్నిరకాలుగా సినీపరిశ్రమకు ఆయన అండగా నిలిచారు. మునుముందు థియేటర్లు తెరుచుకునేలా కృషి చేయనున్నారు. ఇదిలా ఉండగానే పలు ఇండస్ట్రీ కులశక్తులు ఆయనపై చేసిన దుష్ప్రచారం ఎంత మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. నిజానికి ఎంతో నిజాయితీగా సీసీసీ పని చేస్తుండడంతో అది చిరు ఇమేజ్ ని పెంచింది.
ప్రస్తుతం బీచ్ సొగసుల విశాఖ నగరంలో మరో కొత్త టాలీవుడ్ కి అంకురార్పణ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం జగన్ సహకారం కోరి స్టూడియోల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఈ ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే విశాఖ టాలీవుడ్ ప్రకటన వెలువడనుందని ఉత్తరాంధ్ర సహా వైజాగ్ వాసులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఏపీ లో అన్ని ప్రాంతాల నుంచి వైజాగ్ టాలీవుడ్ కి ప్రోత్సాహం అండదండలు లభిస్తుండడం పాజిటివ్ అంశం.
ఇవన్నీ ప్లస్ లు అనుకుంటే ఆయన పెద్దరికంపై మరో వర్గం పుకార్లు వేడెక్కిస్తున్నాయి. చిరు పెద్దరికం కొందరికి కంటగింపుగా ఉంది. అందుకే ఆ నలుగురు లేదా ఆ పదిమందితో కూడుకున్న నిర్మాతల గిల్డ్ మాఫియాకు తల వొంచారని ప్రచారం సాగిస్తుండడం కలకలం రేపుతోంది.
దిల్ రాజు, సురేష్ బాబు, అరవింద్ లాంటి ఇండస్ట్రీ ప్లేయర్స్ చిరు వెనక ఉండి గేమ్ నడిపిస్తున్నారన్న సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇన్నాళ్లు పరిశ్రమను అదుపులో ఉంచుకుని థియేటర్ మాఫియాగా అరాచకాలు చేసిన వీళ్ల వెంట చిరు ఉండడం అంత మంచిది కాదంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ చర్య చిన్న నిర్మాతల్ని విస్మరించినట్టే అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా కాకుండా అందరివాడు అనిపించుకోవాలంటే చిన్న సినిమా తరపున చిరు పోరాడాలని.. చిన్న నిర్మాతల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు. మెజారిటీగా ఉన్న చిన్న నిర్మాతల్ని చిరు పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే వీటన్నిటికీ మెగాస్టార్ సమాధానం సిద్ధం చేస్తున్నారా లేదా? ఆయన ఆ నలుగురికే వత్తాసు పలుకుతున్నారని నిరూపణ అవుతుందా? అన్నదానికి కాలమే సమాధానం ఇస్తుందేమో!!