‘దేవదాస్’: ద్యావుడా…ఇది కూడా కాపీ కథేనా? లేక రైట్స్ కొన్నారా

(సూర్యం)

కాపీ అనండి..ప్రేరణ అనండీ..ఏదైనా అనండీ..ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతీ సినిమాకు హాలీవుడ్డో లేక కొరియా సినిమానో మూలం ఉంటూ వస్తోంది. తాజాగా మరో హాలీవుడ్ సినిమాని లేపి తెలుగులో ఓ సినిమా పూర్తై రిలీజ్ కు రెడీ అయ్యిందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా మరేదో కాదు దేవదాసు.

నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో దేవదాసు టైటిల్ తో    మల్టీస్టారర్‌ రూపొందుతోన్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  నాగార్జునకు సరసన ఆకాంక్షా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా నానికి జోడీగా రష్మికా మందన యాక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది.  

నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాని “ఎనలైజ్ దిస్” అనే సినిమా ఆధారంగా రూపొందుతోందని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు  హెరాల్డ్ రామిస్ డైరెక్ట్ చేసిన హాలీవుడ్ మూవీ “ఎనలైజ్ దిస్” లో  రాబర్ట్ డీ నీరో, బిల్లీ క్రిస్టల్ ప్రధాన పాత్రలు పోషించారు.

1999లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మాఫియా డాన్ రాబర్ట్ డీ నీరో, సైకియాట్రిస్ట్ బిల్లీ క్రిస్టల్ ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది… తనకున్న  డిజార్డర్‌ను పోగొట్టుకోవడానికి సైకియాట్రిస్ట్ బిల్లీ క్రిస్టల్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకోవడం అక్కడ నుంచి సైక్రాటిస్ట్ జీవితంలో వచ్చే సమస్యలు, మార్పులే ఈ సినిమా స్టోరీ లైన్.

ఇదే సినిమాను మలయాళంలో మమ్ముట్టి, శ్రీనివాసన్ ప్రధాన పాత్రధారులుగా “భార్గవ చరితం మూన్నాం ఖండం” పేరుతో రీమేక్ చేస్తే ఫ్లాఫ్ అయ్యింది. అయితే తెలుగుకు వచ్చేసరికి నాని పాత్రకు ఓ లవ్ స్టోరీ పెట్టి..ఆ లవ్ స్టోరీకి డాన్ అయిన నాగార్జున సహాయపడటం అనే కాన్సెప్టుని కలిపారని చెప్పుకుంటున్నారు. ట్రైలర్ చూసినా మనకు అదే అర్దమవుతుంది.