రీమేక్ సినిమా తీయడమే సవాల్ అనుకుంటే.. బ్లాక్ బస్టర్ కొట్టేయడం అన్నది ఇంకెంత కష్టమో! ఊహించగలం. అలాంటి ఛాలెంజ్ ఒకటి యువహీరో రాజ్ తరుణ్ – అగ్రనిర్మాత డి.సురేష్ బాబు ఇద్దరికీ ఎదురైంది. ఇంతకీ ఆ ఛాలెంజ్ లో నెగ్గుతారా? అంటే.. నెగ్గి తీరతామని సెలవిస్తున్నాడు రాజ్ తరుణ్.
నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా. ఈ ఛాలెంజ్ లో నిరూపించుకుంటానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. రాజ్ తరుణ్ తన తాజా ఇంటర్వ్యూలో ఆయుష్మాన్ ఖురానా నటించిన `డ్రీమ్ గర్ల్` తెలుగు రీమేక్ కు సంతకం చేశానని తెలిపారు. ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ తదుపరి ప్రాజెక్టులలో డ్రీమ్ గర్ల్ తెలుగు రీమేక్ ఒకటి అని తెలిపారు.
“ఈ రోమ్-కామ్ చేస్తాను. ఇది నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది నాకు సవాల్ లాంటిది“ అని అన్నారు. ఈ సినిమాతో పాటు శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనున్న సినిమా చేస్తున్నానని తెలిపారు. “షూటింగ్ మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నా.. లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది“ అని చెప్పారు.
గత డిసెంబర్ లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు డ్రీమ్ గర్ల్, సోను కే టిటు కి స్వీటీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆరు రిలీజ్ లు ఉంటాయని తెలిపారు. ఇందులో రెండు కొరియన్ చిత్రాలకు రీమేక్ హక్కులను చేజిక్కించుకున్నామని … 2021లో ఇవీ సెట్స్ కెళతాయని తెలిపారు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ లో `అసురన్` రీమేకవుతోంది. వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రీమేక్ కి తెలుగులో `నారప్ప` అనే టైటిల్ ని నిర్ణయించారు. రీమేక్ కి శ్రీకాంత్ అడ్డాల సంతకం చేశారు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ లాక్ డౌన్ తర్వాత సెట్స్ కెళుతుంది.