‘గబ్బర్ సింగ్’ జ్ఞాపకాలు: నిప్పులపై అడుగులే అన్నారు కానీ..

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌వుతున్న ప‌వ‌న్‌కి గబ్బర్ సింగ్ చిత్రం సక్సెస్ కొండంత బలాన్ని ఇచ్చింది. యాక్షన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో గబ్బ‌ర్ సింగ్ గ్యాంగ్‌తో ప‌వన్ క‌ళ్యాణ్ చేసే హంగామా సినిమాకే హైలైట్. మే 11, 2012న విడుద‌లైన ఈ చిత్రం విడుద‌లై ఏడేళ్ళు అవుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్ త‌న ట్విట్ట‌ర్‌లో పాత జ్ఞాప‌కాలు గుర్తు చేసుకున్నారు.

‘నా వెన్ను తట్టి, నా వెనకాలే ఉండి.. సదా నా విజయం కోరుకునే.. నా ‘గబ్బర్ సింగ్’కు… మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ..’ అంటూ సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ను షేర్‌ చేశారు.

https://twitter.com/harish2you/status/1127023325933293568

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘నేను బీహెచ్‌ఈల్‌లో చదువుకుంటున్న రోజుల్లో పవన్‌ సినిమాలు తెగ చూసేవాడిని. అలాంటిది ‘గబ్బర్‌ సింగ్’ కోసం 2011 డిసెంబర్ 4న ఆయనపై తొలి షాట్‌ తీశా. మొదట వారం రోజులపాటు దర్శకుడిని అనే సంగతి మర్చిపోయా. పవన్‌ ఎలా చేసినా, ఫస్ట్ టేక్ ఓకే అనేవాడిని. ‘శంకర్, సరిపోతుందా..లేదా’ అని ఆయనే నాకు గుర్తు చేసేవారు’ అన్నారు.

అలాగే ‘‘గబ్బర్‌ సింగ్‌’ను ప్రకటించిన సమయంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ హైదరాబాద్‌ వచ్చారు. ‘దబాంగ్’ హిందీలో సూపర్‌హిట్ అయిన సినిమా. డైలాగ్‌లు.. స్క్రిప్ట్‌లు రాసుకునే సత్తా ఉన్న నువ్వు రీమేక్‌ చేయాల్సిన అవసరం ఏంటి?పైగా, పవన్‌ కల్యాణ్‌ అంటే, భారీ అంచనాలు ఉంటాయి. నిప్పులపై అడుగులు వేస్తున్నావేమో’ అన్నారు. నేను నవ్వి ఊరుకున్నా.

రీమేక్‌ చేయడం లేదని నాకు తెలుసు. అది ఆయనతో వాదించే సందర్భం కాదు. ఆ తర్వాత ప్రీమియర్‌ చూసి మెచ్చుకున్నారు. ‘గబ్బర్‌ సింగ్‌’లో పవన్‌ కల్యాణ్‌ను కొత్తగా చూపించాలనుకోలేదు. అప్పటికే పాత పవన్‌ కల్యాణ్‌ను మిస్‌ అయ్యాం. ‘జల్సా’ తర్వాత ఆ స్థాయిలో పవన్‌ను చూపించాలని అనుకున్నా. ‘గోకులంలో సీత’లో ఓ వైట్‌ డ్రెస్‌ వేసుకుని పవన్‌ ఫైట్‌ చేస్తారు. అది చూసి ఆయనకు ఫ్యాన్‌ అయిపోయా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ వాల్మీకి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.