దర్శక ధీర … రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు

“గంగ గోవుపాలు గరిటడైనను చాలు,  కడవదైననేమి ఖరము పాలు ” అని  వేమన కవి ఎప్పుడో చెప్పాడు . ఆ మాటలను దర్శకుడు రాజమౌళి నిజం చేశాడు. 2001లో “స్టూడెంట్ నెంబర్ 1” తో తెలుగు  సినిమా రంగంలోకి దూసుకొచ్చాడు . ఈ 17 సంవత్సరాల్లో ఆయన దర్శకత్వం వహించింది కేవలం 12 చిత్రాలే. . అయితేనే  ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించాడు . హీరోలతోనే కాదు ఈగతో కూడా సినిమా తీయగలనని నిరూపించాడు .

ఈ రోజు రాజమౌళి  తన 45వ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాడు . మూడు సంవత్సరాలు ఓ సినిమా కోసం కేటాయించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు . దర్శకుడు అంటే …. దీపమా ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే వారున్న ఈ రోజుల్లో రాజమౌళి లాంటి దర్శకులు ఉండటం అపురూపమే. . సినిమా ఆయనకు వ్యాపారం కాదు  విపరీతంగా ప్రేమించే ఓ కళాత్మక ఆయుధం .


“తెలుగదేలయన్న  దేశంబు తెలుగేను .. తెలుగు వల్లభుండ ..తెలుగొకండ  “అని మధ్య యుగాలనాడు విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మన భాష గొప్పతనం  గురించి చాటాడు . నిజానికి కృష్ణదేవరాయల మాతృభాష తెలుగు కాదు , తుళు . అయినా అయన తెలుగు భాషను, సంస్కృతీ , సంప్రదాయాలు, కళలను  గౌరవించాడు , పోషించాడు , ప్రోత్సహించాడు . ఆ రాయల వార సత్వాన్ని రాజమౌళి నిలబెడుతున్నాడేమో అనిపిస్తుంది . రాజమౌళి జన్మించింది రాయచూరులో . అంటే ఆనాడు రాయల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది . రాయలు నడయాడిన నెల నుంచి వచ్చిన రాజమౌళి ఆయనను గుర్తుకు తెస్తున్నాడు.

రాజమౌళి తెలుగు వాడు కావడం , అందునా తెలుగు సినిమాలు తీస్తుండటం  మన అదృష్టం . ఆయన ప్రతిభకు, సృజనాత్మక  శైలికి ఒక్క “బాహుబలి ” చాలు . ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచంలో తెలుగు సినిమా వెలుగు జండాను ఎగురవేశాడు .  తెలుగు వారి కీర్తిని, మహానటుడు , నాయకుడు ఎన్టీ రామారావు తరువాత ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా రాజమౌళిదే . అందుకే భారత ప్రభుత్వం ఆయనను 2016లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది . ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ చరణ్ తో ఓ చిత్రం నిర్మించే పనుల్లో వున్నారు . రాజమౌళి మరిన్ని సినిమాలు తీసి తెలుగు సినిమా కీర్తిని పెంచుతారని ఆశిస్తూ .. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు .