(సూర్యం)
అతిలోక సుందరి శ్రీదేవి ఆ మధ్యన హఠాత్తుగా చెప్పా పెట్టకుండా స్వర్గానికి ప్రయాణం పెట్టుకుంది. సరే ఆవిడ ఇష్టం ..అని అభిమానులు భాధతో వీడ్కోలు ఇచ్చారు. ఓ వారం రోజులు పాటు మీడియాలో ఆమె కథనాలు ప్రసారం అయ్యాయి. హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. కానీ స్విట్జర్లాండ్ ప్రభుత్వం మాత్రం ఆమెను మర్చిపోలేకపోతోంది. అందుకే అక్కడ ఆమె విగ్రహం ఒకటి పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీదేవి చాలా సినిమాల షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వచ్చిందని, ఆమె తమ దేశంలో టూరిజం డవలప్ అవ్వటానికి దోహదం చేసిందని కృతజ్ఞత ప్రకటిస్తూ ఇలా తమదైన శైలిలో ఓ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారన్నమాట. శ్రీదేవి ..చాందిని చిత్రం లో స్విట్జర్లాండ్ సీన్స్ అద్బుతంగా ఉంటాయని అభిమానులు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూంటారు.
గతంలోనూ స్విట్జర్లాండ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను రూపొందించిన రొమాన్స్ కింగ్ ..ప్రముఖ దర్శకుడు యశ్ చోప్రాపై అక్కడి ప్రభుత్వం ఇదే తరహాలో తమ గౌరవంను కనబరిచింది. 2016వ సంవత్సరంలో ఆయన విగ్రహంను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన దేశంలోనూ ఆమె గౌరవంగా ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.