గోపీచంద్‌ కొత్త సినిమా టైటిల్… ప్లాఫ్ సెంటిమెంట్

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్‌ నటిస్తున్న 26వ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘చాణక్య’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆదివారం ద‌ర్శక నిర్మాత‌లు విడుద‌ల చేశారు. త్వర‌లోనే ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే ఇప్పటిదాకా చాణుక్య టైటిల్ తో రిలీజైన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన చాణుక్య, అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన చాణుక్య చంద్రగుప్త, చిరంజీవి హీరోగా వచ్చిన చాణుక్య సఫధం …ఇవన్నీ పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. దాంతో గోపిచంద్ చిత్రానికి చాణుక్య అనే టైటిల్ ప్రకటించగానే అభిమానులు కంగారుపడుతున్నారు. అసలే ప్లాఫుల్లో ఉన్న గోపిచంద్ కు ఈ టైటిల్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే టైటిల్ లో ఏముంటుంది. కంటెంట్ గొప్పగా ఉండాలని అని కొందరు అదే సమయంలో నచ్చ చెప్తున్నారు.

ఇక నిర్మాతలు గోపీచంద్‌ను స‌రికొత్తగా చూపిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రమిదని చెప్తున్నారు. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జ‌రీన్‌ ఖాన్ కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. 50 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. విశాల్ చంద్ర శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

‘పంతం’ సినిమా తర్వాత గోపీచంద్‌, మెహరీన్‌ జంటగా నటిస్తున్న సినిమా ఇది. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.