దాడి చేసిన వాళ్ల‌పై గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ వీరంగం!

క‌రోనా విల‌యం: సుర‌భి క‌ళాకారుల్ని ప్ర‌భుత్వాలు గాలికొదిలేశాయా?

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో టెన్ష‌న్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇక ఇలాంటి ప్ర‌మాద‌క‌ర స‌న్నివేశంలో డాక్ట‌ర్లు.. మెడికోలు.. ఆశా వ‌ర్క‌ర్లు.. ఎన్జీవోలు త‌మ ప్రాణాల‌కు తెగించి కొవిడ్-19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వృత్తి ధ‌ర్మంలో భాగంగా మ‌హ‌మ్మారి కాటేస్తుంద‌ని తెలిసినా వృత్తిని వీడేది లేద‌ని ధైర్యంగా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేస్తున్నారు. ఇత‌ర న‌ర్సులు..వార్డు బాయ్ లు సైతం త‌మ ప్రాణాల‌కు లెక్క చేయ‌డం లేదు. సేవే ప‌ర‌మావ‌ధిగా భావించి ప‌నిచేస్తున్నారు. అయితే గాంధీ ఆసుప‌త్రిలో ఇలా చికిత్స చేస్తున్న వైద్యులు..ఇత‌ర సిబ్బందిపై క‌రోనా పేషెంట్ బంధువులు దాడి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ముఖ్య మంత్రి కేసీఆర్ ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. తాజాగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ త‌న‌దైన శైలిలో దాడి చేసిన వారిపై నిప్పులు చెరిగాడు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ ఓ అడుగు ముందుకేసి మాన‌వ హ‌క్కుల సంఘాల్ని ఎడా పెడా తిట్టేశాడు. అస‌లు మాన‌వ హ‌క్కుల సంఘాలు ఇప్పుడేమ‌య్యాయి? మంట‌గ‌లిసిపోయాయా? అంటూ నిప్పులు చెరిగాడు. డాక్ట‌ర్లు.. న‌ర్సులు.. పోలీసులు పౌరులు కాదా? నిన్న జ‌రిగిన ఘ‌ట‌న‌పై పౌర‌హ‌క్కుల సంఘాలు… మాన‌వ హక్కుల సంఘాలు మాట్లాడ‌వా? ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయేరేం అంటూ షంటేశాడు.

ఢిల్లీ నుంచి ఇప్పుడు దిగుతారా దిగ‌రా? స‌జ్జ‌నార్ సార్ ని క‌డిగేయ‌డానికి మాత్రం తోసుకుంటూ ముందుకొస్తారు.. ఇలాంటప్పుడు మాత్రం టీవీల‌కు అతుక్కుపోతారా? అని విమ‌ర్శ‌లు గుప్పించాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా హ‌రీష్‌ చేసిన ఈ వ్యాఖ్య‌లు సంచ‌న‌లంగా మారాయి. హ‌రీష్ వ్యాఖ్య‌ల‌కు చాలా మంది నెటిజ‌నులు స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు మ‌ద్ద‌తు ప‌లికారు. చాలా క‌రెక్ట్ గా తిట్టారు డైరెక్ట‌ర్ గారు అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.