ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు మృతితో నెలకొన్న విషాదం నుంచి కోలుకోక ముందే తెలుగు పరిశ్రమకి మరో దెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాత నారా జయశ్రీ దేవి ఈ రోజు హైదరాబాద్‌లో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే జయశ్రీ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరు తరలిస్తున్నారు.
చిరంజివి, అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీ మంజునాథ, చంద్రవంశం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర వంటి చిత్రాలను నిర్మించారు. ఉత్తమాభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న జయశ్రీ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. నారా జయశ్రీ దేవి ఆత్మకి శాంతి చేకూరాలని తెలుగు రాజ్యం కోరకుంటోంది.
ఇక జయశ్రీకి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల పాటు శిక్షను విధించింది. 2005లో అశ్విని పిక్చర్స్ ఓనర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన ఆనంద్ నుంచి రూ.17.40 లక్షలను ఆమె అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగిచ్చే సమయంలో ఆమె ఆనంద్‌కు చెక్ ఇచ్చారు. అది కాస్తా బౌన్స్ అవడంతో కోర్టు ఆమెకు 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది.
