టీవీ నటి ఇంట్లో దూరి బలవంతంగా…

మీ అమ్మాయిని పెళ్లి చేస్తావా లేదా నీ అంతు చూస్తాం అంటూ ఓ ఇంజినీరింగ్ కుర్రాడు… ఓ టీవీ ఆర్టిస్ట్ ని బెదిరించిన సంఘటన ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ స్టూడెంట్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం… ప్రముఖ టీవీ నటి రితికా ప్రైవేటు ఛానల్‌లో ప్రసారం అవుతున్న రాజారాణి సీరియల్‌తోపాటు పలు సీరియల్స్‌లో నటిస్తోంది. వడపళని వందడుగుల రహదారి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో తండ్రితో పాటు ఆమె నివాసముంటోంది.

గురువారం ఉదయం ఓ యువకుడు అపార్టమెంట్‌లోని రితిక ఇంటి తలుపులు తట్టగా ఆమె తండ్రి సుబ్రహ్మణి తెరిచాడు. ఇంట్లోకి చొరబడిన ఆ యువకుడు నటి రితికాతో తనకు వివాహం జరిపించాలని కోరాడు. అది విని షాక్ కు గురైన తండ్రి ఆ యువకుడితో గొడవకి దిగాడు.

యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన అపార్టమెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని వడపళని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బెదిరింపులకు పాల్పడిన యువకుడు గోబిచెట్టిపాళెయానికి చెందిన భరత్‌గా గుర్తించారు.

ఇంజినీరింగ్‌ స్టూడెంట్ అయిన భరత్‌ ఉద్యోగం కోసం చెన్నైకు వచ్చాడని పోలీసులు వెల్లడించారు. తాను రితికాను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.