స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు ఫలితంగా ఆయన అన్ని చోట్లా నిరసనలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది.
ఈ నేఫధ్యంలో గురువారం ఆయనపై రెండుచోట్ల దాడులు జరిగాయి. అరవకురిచ్చిలో ఎన్నికల సభలో ప్రసంగించి వేదిక దిగుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లతో ఆయనపై దాడి చేశారు.
తిరిగి గురువారం రాత్రి తిరుప్పరంకుండ్రం సన్నిధి వీధిలో బహిరంగ సభలో కమల్ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కమల్‌పైకి చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. బీజేపీ, హనుమాన్‌సేవ సంస్థలకు చెందిన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మరో ప్రక్క ఎంఎన్‌ఎం కార్యకర్తలు ఇద్దరిని అనుమానించి దేహశుద్ధి చేయగా, పోలీసులు జోక్యం చేసుకుని వారిని రక్షించారు. మరోవైపు సులూర్ ఉప ఎన్నికలో శుక్రవారం కమల్‌హాసన్ పాల్గొనే సభలకు కోయంబత్తూరు జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఇక కమల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, హిందూ మున్నాని నాయకులు రాష్ట్రంలో ఆందోళనలు చేయడంతో ఆయన రెండు రోజులపాటు ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు. తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కానీ అన్ని మతాల్లోనూ టెర్రరిస్ట్‌లు ఉన్నారంటూ కమల్ చెప్పుకొచ్చాడు. ఎవరూ తాము ఉత్తములని చెప్పుకోరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుట్లో కనుమరుగయ్యాయని ఆయన తెలిపాడు.