“ఈనాటి ఈ బంధమేనాటితో” పాట ఎక్కడ తీశారో తెలుసా ?

                  (దాదాపు మూడున్నర దశాబ్దాల నాటి మాట)

1982లో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారు బాపు దర్శకత్వంలో “పెళ్ళీడు పిల్లలు ” అనే చిత్రం నిర్మిస్తున్నారు ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో జరుగుతుంది . ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకు ఈ చిత్ర విశేషాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టారు .

అక్కినేని నాగేశ్వర రావు గురువు దుక్కిపాటి మధుసూదన రావు . అంతే  కాదు హైద్రాబాద్లో సినిమా పరిశ్రమ స్థిరపడటానికి  ముఖ్య భూమిక పోషిస్తుంది  కూడా మధుసూదనరావే .

జర్నలిస్టులంటే మధుసూదన రావు గారికి చాలా గౌరవం . ప్రెస్ మీట్  కోసం ఒక గంట ముందే సినిమా షూటింగ్ ఆపివేశారు . దర్శకుడు బాపు , రచయిత ముళ్ళపూడి , జె.వి సోమయాజులు, విజయ శాంతి, సురేష్, శరత్ బాబు , సుమలత, సూర్యకాంతం ,సంగీత మొదలైనవారు వచ్చారు .

సినిమా గురించి , అందులోని  సందేశం గురించి మాట్లాడారు . ప్రెస్ మీట్ అయిపోయిన తరువాత మధుసూదన రావు గారు జర్నలిస్టు లను సెట్  చూద్దురుగాని రండి అని ఫ్లోర్ లోకి తీసుకెళ్లారు .

మాతో పాటు బాపు , ముళ్ళపూడి కూడా వచ్చారు.

సెట్ చాలా బాగుందని మధుసూదన రావుగారికి చెప్పాము .

షడన్ గా ముళ్ళపూడి “మీకిది తెలుసా ?” అన్నారు

అందరి ద్రుష్టి ముళ్ళపూడి మీదకు మళ్లింది .

ముళ్ళపూడి వెంకటరమణ “మీ అందరినీ ఫ్లాష్ బ్యాక్ కు తీసుకెడతాను ” అన్నారు

అందరం ఆసక్తిగా ఆయన వైపు చూశాము .

ఇదే ఫ్లోర్ లో ఆదుర్తి సుబ్బారావు “మూగమనసులు ” చిత్రంలోని “ఈ నాటి ఈ బంధమేనాటిదో … ఏనాడు  పెనవేసి ముడివేసేనో ..!”  పాట  తీశారు .

“నిజంగానా ? “ఆశ్చర్యంతో అన్నాను .

“నిజంగా నిజమే ” అన్నారు నవ్వుతూ .

బాపు గారు , మధుసూదన రావు గారు కూడా ముళ్ళపూడివైపు చూస్తున్నారు .

ఇదే ఫ్లోర్ లో ఆ సినిమాలోని పాట తీశారు  ఆ సినిమా, ఆపాట  నిన్న మొన్న తీసినట్టుగా అనిపిస్తుంది .

ఈసెట్లోకి  రాగానే ఆ నాటి  ఆ స్మృతులు మనసులో మెదిలాయి అని చెప్పాడు .

మూగమనసులు చిత్రంలోని  ఆ పాట  చిత్రీకరణ ఈ సెట్లో అప్పుడు జరిగితే ,

ఆ చిత్ర రచయితల్లో ఒకరైన ముళ్ళపూడి అదే సెట్ లో ఉండి ఆ విషయాన్ని గుర్తు చేయడం మా అందరికీ చాలా ఆనందం అనిపించింది .

ఒక్కసారి కళ్ళుమూసుకుంటే .. నాగేశ్వర రావు , సావిత్రి పాడిన ఆ పాట లీలగా మెదులుతుంది .

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటివి వున్నాయి .అందులో ఇప్పటి తరాన్ని కూడా ప్రభావితం చేస్తున్న సినిమా మూడు మనసులు . మనిషికి  మరో జన్మ ఉందొ లేదో అనేది తాత్విక సంబంధమైన విషయం . నమ్మకం వున్నవారు ఉందంటారు . లేనివారు నిజం కాదంటారు . అయితే ఈ తర్కం పక్కన పెడితే … జన్మ జన్మల  బంధం మీద తీసిన చిత్రం “మూగ మనసులు “. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి  54 సంవత్సరాలు . ఇందులోని కథ, కథనం , మాటలు, పాటలు , నటీనటుల అభినయం , మనసులో ముద్రించుకపోయే సంగీతం , తెర మీద అద్భుతంగా కనిపించే ఛాయాగ్రహణం అన్నీ సమపాళ్లలో కుదిరిన గొప్ప సినిమా “మూగ మనసులు “

ఈ సినిమా ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది , ఊహాతీతమైన అనుభూతిని కలిగిస్తుంది . బాబు మూవీస్ పతాకంపై  సి . సుందరం  ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించిన చిత్రం . ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి , జమున , గుమ్మడి వెంకటేశ్వర రావు , నాగభూషణం , పద్మనాభం , అల్లు రామలింగయ్య , సూర్య కాంతం నటించారు . ఈనాటి ప్రసిద్ధ దర్శకుడు కె . విశ్వనాధ్  సహాయ దర్శకుడుగా పనిచేశాడు . మామ మహదేవన్ పాటలకు కూర్చిన స్వరాలు  అజరామరంగా నిలిచాయని చెప్పడం అతిశయోక్తి  కాదేమో !

ఆచార్య ఆత్రేయ తో పాటు ముళ్ళపూడి వెంకటరమణ  కూడా రచయితగా పనిచేశారు . మాటల మాధుర్యం లాగే ఇందులోని పాటలు కూడా మనసు లో మధురిమలు పలికిస్తాయి . మనిషిని ఊహాతీతమైన జగత్తులోకి తీసుకెడతాయి .

ఇక ఈ పాటను  మనసు కవి ఆత్రేయ రచించారు .  స్వచ్ఛమైన  ప్రేమకు , చక్కటి భాషకు ఈ పాటను నిదర్శనంగా చెప్పుకోవచ్చు .

“మూగమనసులు “సినిమా 1964  జనవరి 31న విడుదలైంది .   ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావు సునీల్ దత్  హీరోగా హిందీలో కూడా తీశారు .

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో “మూగమనసులు ” చిత్రాల్లోని ఈ నాటి ఈ బంధమేనాటిదో  పాట చిత్రీకరణ  సందర్భంలో అక్కినేని, సావిత్రి తో పాటు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు , కెమెరా మన్   పీఎల్ రాయ్ ని చూడ వచ్చు .

– భగీరథ