‘ఎన్టీఆర్` బయోపిక్ పై తేజ కామెంట్

నటరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్” సినిమాకు మొదట అనుకున్న దర్శకుడు తేజ. ఆయన ఆ తర్వాత రకరకాల కారణాలతో డైరెక్షన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నటరత్న ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూపించేందుకు ఆయన కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

అప్పట్లో ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తేజ తెలిపారు. అయితే అందుకు వేరే కారణాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇక తాను చేద్దామనుకుని వదిలేసుకున్న సినిమా ఫలితం విషయంలో తేజ స్పందన ఏమటన్నది ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ విషయమై మీడియా వాళ్లు ఆ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా గురించి మీ స్పందనేంటని.. తేజను మీడియా ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతం నేను నా సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. నాకు ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ చూసే సమయం దొరకటం లేదు. అందుకే స్పందించలేకపోతున్నాను. ఒకవేళ సినిమా చూసుంటే కచ్చితంగా మాట్లాడేవాడిని’’ అని అన్నారు తేజ.

ఆ వెంటనే.. సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలి’’ అని చెప్పారు తేజ.

మరో ప్రక్కతమ పై వస్తున్న విమర్శలు చూసిన దర్శకుడు క్రిష్ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సినిమా విలువ తెలియని వారే ఇలా మాట్లాడుతున్నారంటూ అంటున్నారట. ఈ విమర్శలకు సమాధానం సెకండ్ పార్ట్ లో దొరుకుతుందని అంటున్నారట. `ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌చ్చే నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితాన్ని చూపించనున్నారు. అది కనుక అసంపూర్తిగానే ముగిస్తే కనుక అదీ ఇబ్బందే.