అవి భవిష్యత్తును నిర్ణయించలేవు: డైరెక్టర్ మారుతి

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు అవకతవకలతో ఇప్పటికే కొందరు విద్యార్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంటర్ మొదటి ఏడాదిలో టాప్‌లో మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు, రెండో ఏడాదిలో తక్కువ మార్కులు రావడం.. అంటే కొంతమందికి సున్న మార్కులు, మరికొంతమందికి 5, 6 మార్కులు రావడం.. ఆ తప్పిదాలకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించకపోవడంతో.. ఇప్పుడు తెలంగాణలో ఈ విషయమై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు ఇంటర్ విద్యార్థులలో ధైర్యం నింపేందుకు ముందుకు రావడం నిజంగా అభినందించదగ్గ విషయం. 

దీనిపై డైరెక్టర్ మారుతి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ ప్రియమైన విద్యార్థులారా.. పరీక్షలు అనేవి మనలో ఉన్న నైపుణ్యాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవు. నేను చదువులో యావరేజ్ స్టూడెంట్‌ని. కానీ తర్వాత యానిమేషన్‌లో టాపర్‌ని. నేను చదివిన చదువు నన్ను డైరెక్టర్‌ని చేయలేదు. సినిమాల పట్ల నాకున్న అభిరుచే నన్ను ఇటువైపు నడిపించింది.

కాబట్టి ఎవరూ డీలా పడకండి. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని నిజ జీవితాన్ని ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వండి. పరీక్షల పేరుతో వారిపై ఒత్తిడి తీసుకురాకండి. ఇంటర్ పరీక్షా ఫలితాల కారణంగా తమ వారిని కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎవరో చేసిన పొరపాటుకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం బాధాకరం..’’ అని తెలిపారు.