టాలీవుడ్ ని దశాబ్ధాల పాటు రకరకాల సమస్యలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో థియేటర్ల సమస్య అన్నది ప్రతిసారీ హాట్ డిబేట్. థియేటర్ మాఫియాపై ప్రతిసారీ చిన్న నిర్మాతల పోరాటం తెలిసిందే. ఇక తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన నిర్మాతలు ప్రతిసారీ ఆ నలుగుర.. థియేటర్ సిండికేట్ అంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. పండగల వేళ వారి సినిమాల్ని తప్ప ఇతరులకు అవకాశం ఇవ్వరన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు.
అదంతా అటుంచితే తెలంగాణ – ఏపీ డివైడ్ తర్వాత టాలీవుడ్ ఎటూ తరలిపోకుండా ఆపేందుకు ఆంధ్రా సినీపెద్దలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కొంత సౌకర్యంగా మెలిగారు. కానీ భవిష్యత్ లో మరో సినీపరిశ్రమను తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబించేదిగా స్థానికుల ప్రయోజనాలకు అనుగుణంగా చేయాలన్న హిడెన్ ఎజెండా ఎప్పటికీ మరువలేనిది. అదంతా అటుంచితే బిజినెస్ అనే గేమ్ లో ఆరితేరిపోయిన ఆ నలుగురు లేదా ఆ పదిమంది మాత్రమే థియేటర్లను ఛేజిక్కించుకుని ఆటాడుకోవడం ప్రభుత్వాలకు నచ్చనిది.
ఇకపోతే కరోనా కల్లోలం నేపథ్యంలో ముఖ్యంగా పంచ్ పడింది సినిమాలు తీసే లేదా థియేటర్లను గుప్పిట్ల ఉంచుకున్న ఆ నలుగురిపైనే అన్న విశ్లేషణ సాగుతోంది. వీరంతా కోట్లాది రూపాయల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే 45 రోజుల లక్ డౌన్ తో థియేటర్లు మూత పడ్డాయి. ఈ నెలాఖరుకి అయినా థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉందా? అంటే అందుకు ఆస్కారమే కనిపించడం లేదు. తాజాగా సినిమా థియేటర్ల రన్నింగ్ విషయమై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఇప్పట్లో థియేటర్ల ఓపెన్ చేయడం కుదరదని ప్రకటించడం ఆ నలుగురికి కోపం తెప్పించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇతర రంగాలకు కాస్త వెసులుబాటు కల్పిస్తున్నా జనం గుమిగూడే లేదా అదుపు తప్పే థియేటర్స్ మాల్స్ రంగానికి మాత్రం రిలీఫ్ లేదని మంత్రి వర్యులు తేల్చి చెప్పేశారు. “ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటప్పుడు థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుంది. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని నేను అనుకోవటం లేదు. భౌతిక దూరం ఉండేలా థియేటర్ల సీటింగ్ మార్చాల్సి ఉంది. ఈ నిబంధనకు మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా.. సింగిల్ స్క్రీన్స్ తో పాటు పట్టణాలు గ్రామాల్లోని థియేటర్లు ఆర్ధిక భారాన్ని మోయలేవు. ఎగ్జిబిటర్ లు కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే కనీసం మరో 3 లేదా 4 నెలల పాటు థియేటర్లు తెరిచే ఉద్దేశం మాకు లేదు“ అంటూ తలసాని ఖరాకండిగా చెప్పేశారు.
అదొక్కటే కాదు షూటింగులకు అనుమతులు ఎప్పుడు? అన్నదానిపైనా ఆయన స్పష్ఠమైన సమాధానం అయితే ఇవ్వలేదు. దీని పర్యవసానం అగ్ర నిర్మాతలకు ఇబ్బందికరంగానే మారింది. కరోనా పేరుతో థియేటర్ సిండికేట్ కి బుద్ధి చెబుతున్నారా? అంటూ ఒక సెక్షన్ లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే కరోనా ఉన్నంత కాలం థియేటర్లు ఓపెన్ చేసినా జనాలు థియేటర్లకు వస్తారా? అన్నది సదరు ఎగ్జిబిటర్ వర్గాలే ఆలోచించాల్సి ఉంటుంది.