సైనమా ఆశలపై కరోనా కొట్టిన దెబ్బ
2020 సాక్షాత్తూ ప్రళయాన్నే ఇంటికి తెచ్చింది. ఏ పరిశ్రమను తరచి చూసినా అల్లకల్లోలం కనిపిస్తోంది. ముఖ్యంగా వినోద పరిశ్రమలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇంకే పరిశ్రమ అయినా ఇదే పరిస్థితి. అదంతా సరే కానీ.. టాలీవుడ్ లో ఎదగాలని కలలుగనే ఆశావహులను కరోనా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు.
హీరోలు అయినా లేదా ఔత్సాహిక దర్శకులు అయినా లేదా యువ నిర్మాతగా ఎదగాలని వచ్చినా వీళ్లెవరికీ కరోనా విలయం అర్థం కావడం లేదు. ఈ దారుణ సన్నివేశం ఎప్పటికి ముగుస్తుందో ఎప్పటికి తిరిగి తమ సినిమా పట్టాలెక్కుతుందో కూడా తెలీని పరిస్థితి. చాలా మంది ప్రతిభావంతులు కృష్ణానగర్ .. ఫిలింనగర్ వదిలేసి వెళ్లిపోవాల్సిన సన్నివేశం నెలకొంది. ఇన్నాళ్లు ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ గడపగడపకు తిరిగిన వాళ్లే ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని సన్నివేశంలో పడిపోయారు. ఆర్టిస్టులు .. కొత్త దర్శకుల సన్నివేశం ఇలానే ఉంది. కొందరికి అవకాశాలొచ్చినా ఇప్పట్లో సెట్స్ కెళ్లే సీన్ కనిపించకపోవడంతో ఇలాంటి సమయంలో ఊహించని దెబ్బ పడిపోయిందన్న దిగులు పట్టుకుని ఉన్నారట.
కోటాను కోట్ల కలలు ఆశయాలు కల్లలు అయిపోయాయని లబోదిబోమనేవాళ్లకు కొదవేమీ లేదు. గణపతి కాంప్లెక్స్ మొదలు .. యూసఫ్ గూడ – ఇందిరానగర్ పరిసరాల్లో ఆఫీసులు తెరిచి సినిమా తీస్తున్నామని బీరాలు పోయిన వాళ్లంతా ఇప్పుడు అద్దెలు కట్టలేక అవన్నీ వదిలేసి చడీచప్పుడు లేకుండా ఎవరి దారిన వాళ్లు ఉడాయించారని సమాచారం. వీళ్లంతా తిరిగి వస్తారో రారో కూడా తెలీని పరిస్థితి. సినిమా ఆఫీసులు అంటే వేలు లక్షల్లోనే అద్దెలు చెల్లించాలి. పైసాకి తికాణా లేదు. ఇక ఆఫీసుల అద్దెలేం చెల్లిస్తారు. పైగా మహమ్మారీ ఎప్పటికి వదులుతుందో క్లారిటీ లేని ఈ సన్నివేశంలో ఎవరికీ కనిపించకపోవడమే మేలని భావిస్తున్నారట.