చిరంజీవి:  రాజకీయరంగంలో పడినా సినీరంగంలో తిరగబడ్డ ‘విజేత’ 

Chiranjeevi Fans Twitter Record In 24 hours Is 2.6 millions
చిరంజీవి.. ముందుగా ‘మెగాస్టార్’ అనే పదాన్ని ఉచ్చరించకుండా పలకలేని పేరు.  1978 నుండి సినీ కెరీర్ మొదలుపెట్టి మరే తెలుగు హీరోకీ సాధ్యంకాని కీర్తి ప్రతిష్టలను అందుకున్న నటుడు.  తెలుగు సినిమా చరిత్రను ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వాళ్లు మొదలుపెడితే ఆ చరిత్రను మలుపు తిప్పి సినిమాను కొత్త పరవళ్లు తొక్కించింది మాత్రం చిరంజీవే.  డ్యాన్సుల నుండి ఫైట్లు, మేనరిజమ్, డైలాగులు ఇలా ప్రతి అంశంలోనూ తనదైన కొత్త మార్క్ చూపించారు చిరు.  అందుకే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.  ఎన్టీఆర్ తర్వాత ఆ నెంబర్ 1 స్థానాన్ని చిరు భర్తీ చేయగలిగారు కానీ ఆయన తర్వాత ఎవరు నెంబర్ 1 అనేది ఇంకా అసంపూర్ణంగానే ఉంది.  కారణం చిరు సెట్ చేసిన ప్రమాణాలను పూర్తిగా అందుకోగల నటుడు లేకపోవడమేనని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. 
Chiranjeevi
 
 
ఇలా సినిమాల పరంగా ఎవ్వరూ అందుకోలేని స్థానానికి, ప్రశ్నించలేని స్థాయికి వెళ్లిన చిరు జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు రాజకీయాల్లోకి రావడమే.  సినిమాల్లో అత్యున్నత స్థాయిలో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.  రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత లేకుండానే, వైఎస్సార్ మంచి స్వింగ్లో ఉండగానే చిరు పార్టీ పెట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  కేవలం ఒక జాతీయ పార్టీకి అనుకూల పరిస్థితులు సృష్టించడానికే చిరు పార్టీ పెట్టారని మొదట్లోనే ఆరోపణలు స్టార్టయ్యాయి.  ఇక టికెట్ల కేటాయింపులో అయితే టికెట్లు అంముకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  కానీ చిరు మాత్రం మేనిఫెస్టోలో చెప్పినట్టే ఎక్కువ శాతం టికెట్లు బీసీలకే కేటాయించారు. 
 
అన్ని అవమానాలు, ఆరోపణలు తట్టుకుని ఎన్నికలకు వెళ్ళాక ప్రజారాజ్యం గెలిచింది 294 స్థానాల్లో కేవలం 18 సీట్లలో మాత్రమే గెలిచారు.  ఆ ఓటమితో చిరు మనసు విరిగిపోయింది.  సూటిపోటి మాటలను, అవమానాలను, ఆరోపణలను తట్టుకోలేకపోయారు.  ఇక ఈ కుల, వెన్నుపోటు రాజకీయాలను తట్టుకోలేమని గ్రహించి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు.  చిరు రాత్రికి రాత్రి తీసుకున్న ఆ నిర్ణయంతో అభిమానులు అల్లకల్లోలం అయిపోయారు.  ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, చిరును నమ్మి ఓట్లేస్తే చివరికి ఆ పార్టీలోనే ప్రజారాజ్యంను కలపడాన్ని వారు ఏమాత్రం సహించలేకపోయారు.  ఇక అన్నయ్యతో మాకు ఎలాంటి సంబంధం లేదని తెంచేసుకున్నారు.  
 
ఆ పరిణామంతో చిరు సైతం విస్తుపోయారు.  ఈ పరిణామంతో సినిమాల్లో కూడా చిరుకు భవిష్యత్తు ఉండదని అందరూ డిసైడైపోయారు.  చిరు సైతం 2017లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇద్దామని అనుకున్నప్పుడు తనను అభిమానులు, ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని అనుమానపడ్డారు.  ఎన్నో లెక్కలు వేసుకుని చివరకు ‘ఖైదీ నెం 150’తో రీ ఎంట్రీ ఇవ్వనే ఇచ్చారు.  కానీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఆ సినిమా 100 కోట్లను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.  ఆ తర్వాత వచ్చిన ‘సైరా’ సైతం భారీ వసూళ్లను సాధించి చిరు స్థామినా ఇంకా తగ్గలేదని రూఢీ అయింది.  ప్రేక్షకులు ఇంకా చిరును వెండితెర మీద కోరుకుంటున్నారని ప్రూవ్ అయింది.  ఒకప్పటిలాగే నెంబర్ 1 స్థానం ఆయనదేనని నిరూపితమైంది. 
 
చిరు కూడా కొత్త హీరో తరహాలోనే ప్రతి సినిమాకు వెరియేషన్ చూపాలని, తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలని తపిస్తున్నారు.  ఇప్పుడున్న స్టార్ హీరోలంతా చిరును పోటీగా భావిస్తున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.  మొత్తానికి చిరు రాజకీయరంగంలో పడినా సినీ రంగంలో తిరగబడి నిలబడి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తాను ‘విజేత’నే అని, తనలో ఆ ఫైటింగ్ స్పిరిట్ తగ్గలేదని చాటుకున్నారు.