ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండల రావు గారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో రావి కొండల రావు గారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండల రావు గారితో పలు చిత్రాల్లో నటించడం జరిగింది.
ముఖ్యంగా మా కాంబినేషన్ లో వచ్చిన చంటబ్బాయి , మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాలలో రావి కొండల రావు గారు చాలా కీలక పాత్రలు పోషించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండల రావు గారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు గొప్ప రచయితను పాత్రికేయున్ని ప్రయోక్తను కోల్పోయింది. అలాగే నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా రావికొండల రావు గారి మరణం ఒక తీరని లోటు. రావి కొండల రావు గారూ ఆయన సతీమణి రాధా కుమారి గారు జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.
చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా ఆ ఇద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లాగ వచ్చి వారి అభినందనలు, ఆశీస్సులు అందించడం చూడముచ్చటగా ఉండేది.అలాంటి రావి కొండల రావు గారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.