మొదటి నుంచీ డైరక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో కాస్త ఎక్కువగా ఎమోషన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బోయపాటి హీరోలు మామూలుగా రెచ్చిపోరు. హీరో పది మందిని కొట్టే స్దాయి నుంచి ఒకే సారి వంద మందిని మట్టికరిపించడం దాకా ఆయన తెలుగు సినిమాని తీసుకువెళ్లారు. వయిలెన్స్ తో నడిచే సీన్స్ బోయపాటి సినిమాలోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ మారుతున్న రోజుల్లో..ఇప్పటి యూత్ కు ఇవి పడతాయా… అన్న విషయమై మీడియాతో ఆయన ఆలోచనలను పంచుకున్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ..‘‘సినిమా అనేది ఓ కల. మనం చేయాలని, చేయలేని విషయాలు కొన్నుంటాయి. అవి తెరపై హీరో చేస్తుంటే.. ప్రేక్షకులు ఆనందిస్తుంటారు. వాళ్లేం లెక్కలేసుకుని చూడరు. లాజిక్కులు వేసుకోరు. నిజ జీవితంలో ఓ అమ్మాయి ‘ఐ లవ్ యూ’ చెబితే… అబ్బాయి రోడ్డు మీద అప్పటికప్పుడు డాన్స్ చేసుకుంటూ పాట పాడుతుంటాడా? ఇవేం నిజ జీవితంలో జరగవని ప్రేక్షకులకు తెలుసు. కానీ వాళ్లు ఆస్వాదిస్తున్నారంటే అర్థం ఏమిటి? యాక్షన్ కోసమే యాక్షన్ అన్నది నాకు ఇష్టం ఉండదు. సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి.. నా హీరో విజృంభిస్తుంటాడు’’అంటూ చెప్పుకొచ్చారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని ఇప్పటికే రిలీజైన ప్రోమోలు, ట్రైలర్స్ ద్వారా మనకు అర్దమవుతుంది.