బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి నెల రోజులు కూడా గడువక ముందే మరో పెను విషాదం చోటు చేసుకుంది . మదర్ ఆఫ్ డాన్స్, బాలీవుడ్ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్ను మూసారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో శనివారం ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో చేరిన సరోజ్ ఖాన్ చికిత్స పొందుతున్నప్పుడు గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజు జామున కన్ను మూసారు. దీంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికీ సుషాంత్ మరణంపై రోజు ఓ వార్త బాలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాని వేడెక్కిస్తోంది.
ఈ నేపథ్యంలో మరో మరణం సంచలనంగా మారింది. సరోజ్ ఖాన్ మృతిపట్ల పరిశ్రమకు చెందిన వారంతా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక సరోజ్ ఖాన్ 1950 దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అటుపై మంచి కొరియోగ్రాఫర్ గా ఖ్యాతికెక్కారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్య దర్శకురాలిగా పనిచేసారు. అలా మదర్ ఆఫ్ డాన్స్ గా ప్రసిద్ది చెందారు. 1974లో గీతా మేరా నామ్ చిత్రంతో ఆమె ప్రస్థానం మొదలైంది. మిస్టర్ ఇండియా, నాగినా, చాంద్ నీ వంటి గొప్ప చిత్రాలకు కొరియోగ్రఫీ చేసారు.
ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కు పేరు తెచ్చిన తేజాబ్ చిత్రంలోని ఏక్ దో తీన్ పాటకు ఆమె కొరియోగ్రఫీ చేసారు. ఆ పాట..డాన్సు దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తర్వాత దేవదాస్ చిత్రంలోని `డోలారే రే డోలా` పాట సహా ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేసి బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాకు కొరియోగ్రఫీ చేసారు. ఈ సినిమాకు గాను నంది అవార్డు కూడా అందుకున్నారు. అలాగే మూడుసార్లు జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.