ప‌వ‌న్ పారితోషికంలో బార్ గెయిన్‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం గురించి తెలిసిందే. ఓవైపు రాజ‌కీయాలు .. మ‌రోవైపు సినిమాలు. రాను రానంటూనే ఆయ‌న‌ రీఎంట్రీ ఇచ్చేశారు. పింక్ రీమేక్ కోసం ఆదిత్య శ్రీ‌రామ్ తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వేళ ప‌వ‌న్ రీఎంట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక పూట‌ జ‌న‌సేన కార్య‌క్ర‌మాల‌తో బిజీ. మ‌రో పూట సినిమా షూటింగుల‌తో బిజీ. అందుకోసం ల‌క్ష‌ల్లో వెచ్చించి ప్ర‌త్యేక‌మైన చాప‌ర్ ని ప‌వ‌న్ కోసం నిర్మాతలు ఎరేంజ్ చేశార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

అదంతా స‌రే కానీ.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమా కోసం 50 కోట్ల పారితోషికం అందుకుంటున్నార‌న్న ప్ర‌చారం ఉంది. ఇందులో నిజం ఎంత‌? అని ఆరా తీస్తే మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. ప‌వ‌న్ రీఎంట్రీ కాబ‌ట్టి అత‌డి క్రేజును దృష్టిలో పెట్టుకుని ఏకంగా రూ.50 కోట్ల ప్యాకేజీని ముట్ట‌జెప్పేందుకు దిల్ రాజు అంగీకారం కుదుర్చుకున్నార‌ట. అయితే పారితోషికం విష‌యంలో 35 కోట్ల‌కు అడ్జ‌స్ట్ కావాల్సిందిగా రాజుగారు బార్ గెయిన్ చేయ‌డంతో చిర్రెత్తుకొచ్చిన ప‌వ‌న్ ఏకంగా చేతిలో టీక‌ప్ ని నేల‌కేసి కొట్టార‌ట‌. అయితే ప‌వ‌న్ ని మ‌రీ అంత‌గా ఇర్రిటేట్ చేసేలా రాజుగారు బ‌తిమాలుకున్నారా? అస‌లు ఇందులో నిజం ఎంత‌? అన్న గుస‌గుసా వేడెక్కిస్తోంది. అస‌లే అగ్ర హీరోల సినిమాలు 70-80 కోట్ల పెట్టుబ‌డిని అధిగ‌మిస్తున్నాయి. ఒక్కోసారి 100 కోట్ల పెట్టుబ‌డిని పెట్టాల్సి ఉంటోంద‌న్న టాక్ ఉంది. ఇక పింక్ కి డ‌బ్బింగ్ రైట్స్ నుంచి వ‌చ్చేదేం లేదు కాబ‌ట్టే ఆయ‌న అలా బ‌తిమాలారు అన్న చ‌ర్చా సాగుతోంది.

మ‌రో కోణంలో చూస్తే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే మినిమం 100 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ కి డోఖా ఉండ‌దు. అందుకే ప‌వ‌న్ 50 కోట్ల రేంజులో డిమాండ్ చేశారు. ముందు దానికి అంగీక‌రించి ఇప్పుడు బేరానికి వ‌చ్చార‌నే అలా సీరియ‌స్ అయ్యారా? అన్న ముచ్చ‌టా సాగుతోంది. అస‌లింత‌కీ అది కేవ‌లం ఉత్త ప్ర‌చార‌మేనా? ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది క‌రాఖండిగా తెలియాల్సి ఉంది.