బండ్ల గణేష్ గురించి తెలియన తెలుగు సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సినిమా నిర్మాతగానే కాకుండా వేదికలు ఎక్కితే వంద మంది త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు పూనితే ఎలా ఉంటుందో అలా మాటల ప్రవాహాంతో అందర్నీ ఆశ్చర్యపరిచే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. అందులోనూ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడు.
పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించాడు. అందులో తీన్‌మార్ నిరాశపర్చగా.. గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గబ్బర్ సింగ్‌తో బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగాడు. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటూ భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ వచ్చాడు. మధ్యలో కాసింత గ్యాప్ ఇచ్చాడు. రాజకీయంగా దెబ్బ తినడంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నాసిరకం పాత్ర చేయడంపై పెదవి విరిచిన బండ్లన్న ఇకపై నటించకూడదని, కేవలం సినిమాలను నిర్మించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. మా అన్న పవన్ అన్నగారితో సినిమా ఎప్పుడు తీస్తున్నారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ రిప్లై ఇచ్చాడు. నేను అదే పనిలో ఉన్నాను బ్రదర్.. మన దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ బండ్ల గణేష్ చిన్న హింట్ ఇచ్చాడు. మొత్తానికి సినిమా తీసే ప్రయత్నాల్లోనే ఉన్నానని తెలిపాడు. అయితే వకీల్ సాబ్, క్రిష్‌తో ఓ ప్రాజెక్ట్, హరీష్ శంకర్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు కావాలి.. బండ్లన్నకు సందు ఎప్పుడు దొరకాలి.