బాలయ్యతో తిరిగి ఇలా అయ్యావంటూ.. క్రిష్ కు కౌంటర్స్

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం యన్‌.టి.ఆర్‌. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను .. రెండు భాగాలుగా విడుదల చేస్తున్న ఈ సినిమాలో తొలి భాగంలో ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు.

అంతేకాదు ఈ బయోపిక్‌ కోసం ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందే తడిచే పాటను రీమేక్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికి ఓ పోస్టర్ ని వదిలారు. అది మరేదో కాదు.. శ్రీదేవి పాత్రలో కనిపించనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ పోస్టర్‌ .

ఆకుచాటు పిందే తడిచే పాటలోని రకుల్‌ లుక్‌నే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అయితే ఆ పోస్టర్ విడుదల చేస్తూ..ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి అని
పేర్కొన్నారు. అది చూసిన కొందరు సినీ అభిమానులు మండిపడుతున్నారు. ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ ..శ్రీదేవి కాదని సావిత్రి అనే విషయం క్రిష్ మర్చిపోయాడని గుర్తు చేస్తున్నారు. కొందరైతే..బాలయ్యతో తిరిగి ఇలా అయ్యావంటూ వెటకారం చేస్తున్నారు. అయితే క్రిష్ వాటిల్లో  వేటికీ రెస్పాండ్ కాలేదు.

ప్రస్తుతం  షూటింగ్  దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్‌గా సుమంత్‌, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్‌ నటిస్తున్నారు.