బాలకృష్ణ మాజీ పీఏకు మూడేళ్ల జైలు శిక్ష
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు గతంలో పీఏగా పనిచేసిన శేఖర్ నాయుడుకు నెల్లూరు ఏసీబీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2008లోనే శేఖర్‌పై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు కోటిన్నర విలువైన అక్రమ ఆస్తులున్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించడంతో శేఖర్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ. 3 లక్షల జరిమానా విధించింది నెల్లూరు ఏసీబీ కోర్టు.
తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో సూపర్ వైజర్‌గా చేరిన శేఖర్ వివిధ హోదాల్లో పని చేశారు. అనంతరం 2014లో హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణకు పీఏగా పని చేశాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బాలయ్య సినిమాల్లో బిజీబిజీగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఉంటూ బాలకృష్ణపేరుతో శేఖర్ అక్రమ వసూళ్లకు పాల్పడే వారని ప్రచారం ఉంది.
ఆ సమయంలో అతనిపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. షాడో ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో..బాలకృష్ణ ఆయన్ను తొలగించారు. ప్రస్తుతం శేఖర్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య పీఏ అక్రమ వసూళ్లు అరాచకాలపై టీడీపీ నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృస్ణకు నేరుగా ఫిర్యాదు సైతం చేశారు. అంతేకాదు తనకు వ్యతిరేకంగా ఉండేవారిపట్ల బాలయ్యకు చెడుగా చెప్పేవారని కార్యకర్తలు ఆరోపించేవారు.
దాంతో నియోజకవర్గంలో టీడీపీలో విబేధాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారకుడు అయ్యారని పెద్దఎత్తున వార్తలు వినిపించాయి. ఆరోపణలు తీవ్రం కావడంతో బాలకృష్ణ శేఖర్ ను తప్పించారు.