తెలంగాణలో బాలకృష్ణ పర్యటన షెడ్యూర్ ఖరారు,డిటేల్స్

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి బాలకృష్ణ దిగుతున్నారు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో నందమూరి బాలకృష్ణ పర్యటన షెడ్యూర్ ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఆయన టీడీపీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

ఈ నెల 30, డిసెంబరు 1 తేదీల్లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో, డిసెంబరు 2న ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, డిసెంబరు 3న మహబూబ్‌నగర్, మక్తల్, డిసెంబరు 4న ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఉప్పల్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బాలకృష్ణ.

అయితే విజయశాంతి కూడా బాలయ్యతో పాటు రోడ్ షోలలో పాల్గొంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ మాత్రం రాలేదు. ఉమ్మడి ప్రత్యర్ధిని జయించడమే వ్యూహంగా ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో తెలుగు దేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇద్దరు ప్రత్యర్ధులను వీళ్లిద్దరినీ ఒకే వేదికపైకి తెస్తోంది.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి, బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త ఉషారుని ఇస్తోంది. మహాకూటమి తరపున ప్రచారం చేయటానికి హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు.

బాలయ్య ఈ ప్రచారంలో ఉన్న సమయంలో బయోపిక్ షూటింగ్ మాత్రం ఆగదు. మిగతా ఆర్టిస్ట్ లతో షూటింగ్ కొనసాగుతుంది. డిసెంబర్ 6 నుంచి బాలయ్య షూటింగ్ లో పాల్గొంటారు.