సినీ నటుడు, తెలుగుదేశం పార్టి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన ధోరణిలో చిందులు తొక్కి వార్తలకు ఎక్కిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగన సంఘటన మరోసారి బాలయ్య ని ఒక్క రాత్రిలో భారీ ఎత్తున విలన్ ని చేసింది. ఒక మీడియా ప్రతినిధిపై విరుచుకుపడటం, ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేవటం అన్ని వర్గాల చేతా విమర్శలకు లోనైంది. ఈ నేపధ్యంలో బాలయ్య ..క్షమాపణ కోరుతూ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
ఆ వివరణలో … ఇదంతా నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు.. అని బాలయ్య అన్నారు. బాధ కలిగించి ఉంటే క్షమించండి నా ప్రవర్తన వల్ల మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాను.. అంటూ బాలయ్య తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా వివరణ ఇచ్చారు.
ఈ సంఘటన తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రియలైజ్ అయిన ఆయన క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారని అందరూ గ్రహించారు. అయితే బాలయ్య క్షమాపణలు చెబుతూ ప్రకటన చేసే సమయానికే… జరుగాల్సిన నష్టం జరిగింది. ‘రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యి…సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను దాదాపు అన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. బాలయ్య తీరును ఏకిపారేస్తూ డిబేట్లు పెట్టాయి. ఈ నేపధ్యంలో బాలయ్య క్షమాపణలతో మీడియా శాంతిస్తుందా? అనే సందేహాలు తెలుగుదేశం పార్టీలో అందరిలో కలుగుతున్నాయి.