ఆగస్ట్ 2019 బాక్సాఫీస్ రిజల్ట్ ఇదీ
2019 ఆగస్టు బాక్సాఫీస్ రిజల్ట్ మాటేమిటి? అంటే… ఎంతో ఆశిస్తే తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆగస్టు ముగింపు ఊహించని రిజల్ట్ షాకిచ్చింది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రమోటైన భారీ బడ్జెట్ చిత్రం సాహో క్రిటిక్స్ సహా కామన్ ఆడియెన్ నుంచి మెప్పు పొందలేకపోయింది. విజువల్ రిచ్ కంటెంట్ ఉన్నా కథ కాకరకాయ లేని సినిమా అని తీసిపారేశారు. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. అయితే సాహో తొలి వీకెండ్ సహా వినాయక చవితి సెలవు కలిసి రావడంతో ఆరంభ వసూళ్ల పరంగా ఎలాంటి డోఖా లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ (సుమారు 100కోట్ల షేర్ అంచనా) వసూలు చేసిందని ట్రేడ్ వెల్లడించింది. మిశ్రమ స్పందనల నడుమ ఈ స్థాయి వసూళ్లు దక్కించుకోవడం అంటే డార్లింగ్ ప్రభాస్ కి అభిమానుల్లో ఎంత క్రేజు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నవతరం దర్శకుడు సుజీత్ కొత్తగా ప్రయత్నించాలని కన్ఫ్యూజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక ఈ ఆగస్టులో జెన్యూన్ బ్లాక్ బస్టర్ ఏది? అంటే.. అడివి శేష్ నటించిన `ఎవరు` చిత్రానికి ఆ క్రెడిట్ దక్కింది. శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా ఎవరు రికార్డులకెక్కింది. గూఢచారి లాంటి క్లాసిక్ హిట్ తర్వాత అతడు నటించిన ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. శేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ బాక్సాఫీస్ బంగారు బాతులా మారుతున్న వైనం అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో చర్చకు వచ్చింది. అలాగే ఈ నెలలో ఏదైనా డీసెంట్ హిట్ ఉందా అంటే.. బెల్లంకొండ `రాక్షసుడు`కి ఆ క్రెడిట్ దక్కింది. వరుసగా అరడజను ఫ్లాపుల తర్వాత యువహీరోకి ఊపిరి పోసింది ఈ చిత్రం. ఈ ఉత్సాహంలో శీనూ మరో హిట్టు కొట్టాలన్న పంతంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడట. ఈ విజయం దర్శకుడు రమేష్ వర్మకు ప్లస్ కానుంది. స్ఫూఫ్ నేపథ్యంలో వచ్చినా సంపూర్ణేష్ బాబు `కొబ్బరిమట్ట` ఘనవిజయం సాధించడం మరో హైలైట్.
శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ డ్రామా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. శర్వానంద్ ఎంత కొత్తగా ట్రై చేసినా నటుడిగా మార్కులు వేయించుకోగలిగాడు కానీ ట్రేడ్ కి లాభాలు అందించలేకపోయాడు. పంపిణీ వర్గాలకు తీవ్ర నష్టాలొచ్చాయని తెలుస్తోంది. కార్తికేయ నటించిన గుణ 369 ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. పరిమిత బడ్జెట్ వల్ల పంపిణీ వర్గాలు సేఫ్ అయ్యాయన్న టాక్ వినిపించింది. ఇక ఈ నెలలో అతి పెద్ద డిసప్పాయింట్‌మెంట్ ఏదైనా ఉంది అంటే అది కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు 2
వల్లనే. నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చి.ల.సౌ తర్వాత రాహుల్ రవీంద్రన్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అడల్ట్ కంటెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియెన్ థియేటర్లకు రాకపోవడం మైనస్ గా మారిందన్న రిపోర్ట్ అందింది. ఇక ఇతరత్రా సినిమాల రిజల్ట్ గురించి ప్రస్థావించాల్సిన పనేలేదు.