ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో థియేటర్స్ ప్రారంభమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు. థియేటర్స్ ఓపెన్ అయినా జనాలు మునుపటిలా వస్తారో లేదో చెప్పలేం. అందుకే కొందరు నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చిన్న సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. అయితే తెలుగులో V చిత్రంతో ఓటీటీ భారీ సినిమాలకు గాలం వేయడం ప్రారంభించింది. ఇక కోలీవుడ్‌లో సూర్య తన సూరారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని అక్టోబర్ 30న ఓటీటీలో రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు.
ఇక ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినబడతున్నాయి. ముఖ్యంగా సూర్యకు ఎంతో సన్నిహితుడైన సింగం డైరెక్టర్ హరి స్పందించాడు. ‘సూర్య నటించే చిత్రాలను తెరపై చూస్తేనే బాగుంటుందనేది ఓ అభిమానిగా నా కోరిక. అందువల్ల సూరారై పొట్రు చిత్రాన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయాలన్న నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలి’ అని ఓ సలహా ఇచ్చాడు. ఇక ఈ వివాదంపై వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ స్పందించారు.
‘నిజానికి వచ్చే జనవరి నెల వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశాలు లేవు. ఆ తరువాత కూడా ఎలా ఉంటుందనేది అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమాలను థియేటర్లలోనే చూడండి అని ప్రజల ఆరోగ్యాలతో, వారి ప్రాణాలతో ఆటలాడటం చాలా తప్పు. అందుకని ఓటీటలో నేరుగా ఆశాశం నీ హద్దురా (సూరారై పొట్రు) చిత్రాన్ని విడుదత చేయాలని సంకల్పించిన సూర్, వీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించిన నానిలను నేను అభినందిస్తున్నాను. వీ చిత్రం తనకు మైలు రాయి లాంటి 25వ చిత్రమైనప్పటికీ నేటి వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో విడుదల చేయడానికి నాని అంగీకరించడం ఎంతైనా అభినందనీయం.
ఇంట్లో క్షేమంగా ఉంటూ, ఎంటర్టైన్మెంట్ కోరుకునేవాళ్లందరికీ సూర్య, నాని ఓ మార్గం చూపిస్తున్నారు. అలాగే డైరెక్టర్ హరి సినిమాలకు నేను అభిమానిని. ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాల్సిందిగా ఆయనను కోరుతున్నాను. సూర్య సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆయన అభిమానులందరూ పరుగెత్తుకుని వచ్చేస్తారు. అయితే వారి ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మనకు లేదని గ్రహించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి తగ్గట్టు నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని అశ్వనీదత్ పేర్కొన్నారు.