పరీక్షించుకోవటానికే వెళ్తున్నా…ఎన్ని రోజులుంటానో

పరీక్షించుకోవటానికే వెళ్తున్నా…ఎన్ని రోజులుంటానో..ఏమో: హేమ

తాను ఓ ప్రముఖ టీవీ షోలో పాల్గొనేందుకు వెళుతున్నానని, అక్కడ ఎన్ని రోజులుంటానో, ఏమో తెలియదని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులరైన హేమ వ్యాఖ్యానించింది. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆమె, తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, తనను తాను పరీక్షించుకోవడానికే ఆ షోలో పాల్గొనేందుకు వెళుతున్నానని తెలిపింది. తూర్పు గోదావరి ప్రజలు తనను గెలిపించాలని కోరుతున్నానని, ఎన్ని రోజులు అక్కడే ఉంటానో తెలియదని అంది.

తన కుటుంబాన్ని వదిలి తానుండగలనా? లేదా? ప్రజలు ఎంతవరకూ ఆదరిస్తారు? వంటి విషయాలను తెలుసుకోబోతున్నానని పేర్కొంది. కాగా, హేమ బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళుతోందని సమాచారం. ఆ విషయంపైనే ఆమె పై వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

అలాగే తాను త్వరలోనే రాజమహేంద్రవరంలో ఇల్లు తీసుకుంటానని, ఇకపై ఇక్కడే ఉండి, ప్రజలకు సేవ చేస్తానని హేమ ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఒకసారి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చానని, మరోసారి రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇక సినిమాలు చేయబోనని స్పష్టం చేసింది.

నాగార్జున హోస్ట్ గా టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ తొలిరోజు షూటింగ్ పూర్తయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను నాగ్, హౌస్ లోకి పంపారని, ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అంటున్నారు. వీరి పేర్లు బయట పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ కార్యక్రమం నేటి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. వీరంతా 90 రోజుల పాటు హౌస్ లో గడపనున్నారు.