ఆమె భారీ ఆఫర్‌ని తిరస్కరించింది!?

ఆమె భారీ ఆఫర్‌ని తిరస్కరించింది!?

ఎస్.. మీరు వింటున్నది నిజమే.. ఆమె ఎవరో కాదు..అగ్ర కథానాయిక అనుష్క. ప్రయోగాత్మక, మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచి, అగ్ర హీరోలకు దీటుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న  కథానాయిక అనుష్క. తన వైభవం వెండి తెరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో.. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ కోసం వచ్చిన భారీ ఆఫర్‌ని సైతం ఆమె తిరస్కరించింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్ సంస్థ పలు భాషల్లో నిర్మించబోయే ఓ వెబ్‌ సిరీస్‌ కోసం అనుష్కను సంప్రదించింది. అలాగే, ఈ వెబ్‌ సిరీస్‌లో నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికాన్ని ఇచ్చేందుకు కూడా నెట్‌ఫ్లిక్ సిద్ధమైంది. అయితే వెబ్‌ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి లేదని, సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని అనుష్క తెలిపినట్టు సమాచారం. నిజానికి తనకు దక్షిణాదిలో ఉన్న అగ్ర కధానాయిక ఇమేజ్ వెబ్ సిరీస్ లో చేస్తే దెబ్బ తింటుందనే భయంతోనే ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే, పాపులర్‌ తమిళ నటుడు విజయ్ సేతుపతికి జోడిగా ఓ ద్విభాషా చిత్రంలో అనుష్క నటించబోతోంది. కె.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. గతంలో దర్శకుడు కె.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో ‘నాన్న’ చిత్రంలో అనుష్క నటించింది . కమల్‌హాసన్‌, గౌతమ్‌మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఘవన్‌’ చిత్రం అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ విశేష విజయం సాధించింది. ఈ చిత్ర సీక్వెల్‌లో కమల్‌హాసన్‌ సరసన అనుష్క నటించనున్నట్టు తెలుస్తోంది.