అమలా..ఈ కామెడీ ఏంటమ్మా…జనం నవ్వుకుంటున్నారు

మన్మధుడు 2 పై  అమల కామెంట్ ..కామెడీనే

వయసుకు రివర్స్ లో రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్న కింగ్‌ నాగార్జున తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్‌. అయితే ఈ ప్రయత్నం ఆకట్టుకోలేదు సరికదా అపహాస్యం పాలైంది. అందరూ ఈ సినిమాని ఏకి పారేస్తున్నారు. రాహుల్ దర్శకుడిగా రెండో సినిమా గండం దాటలేకపోయారని మొదటి రోజు మార్నింగ్ షోకే తేలిపోయింది.

సినిమా టాక్ బాగోలేనంత మాత్రాన ఈ సినిమాని ప్రమోట్ చేయటం మానలేం కదా అనుకున్నారో ఏమో కానీ…ఆమె ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. ‘మన్మథుడు 2’ సినిమా చూసి తెగ నవ్వుకున్నానని అక్కినేని అమల తెలిపారు. ఆమె భర్త, ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. సినిమా చక్కగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్‌ చిత్రం. అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు. దాంతో ఆమె సినిమా చూసి నవ్వుకున్నారో లేదో కానీ ఈమె కామెంట్స్ చూస్తే మాత్రం తెగ నవ్వు వస్తోంది అంటున్నారు.

ఇక ‘మన్మథుడు 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.5.03 కోట్ల షేర్‌ సాధించిందని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రూ.3.86 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. వారాంతంలో ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కానీ అంత సీన్ కనిపించటం లేదు. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. లక్ష్మి, ఝాన్సి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత, కీర్తి సురేశ్‌ అతిథి పాత్రల్లో కనిపించారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.