‘టాక్సీవాలా’టీమ్ ని పబ్ కు తీసుకెళ్లిన బన్ని (ఫొటో)

చిన్న బడ్జెట్ లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మొదటనుంచీ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ప్రతిభ ఉన్నవారిని అభినందిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు టాక్సీవాలా టీమ్ కు అల్లు అర్జున్ లావిష్ గా పార్టీ ఇచ్చారు. బి డబ్స్ పబ్ లో ఈ పార్టీ జరిగింది. అక్కడ వారిందని పిలిచి అభినందనలు తెలియచేసారు. ఇంతకు ముందు మహానటి, పెళ్లి చూపులు టీమ్ లకు ఇలాగే పార్టీ ఇచ్చారు.

విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయ్యి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ అందుకుంది. విజయ్‌ రీసెంట్ సినిమా ‘నోటా’ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా ఆడాలని ఆయన బలంగా కోరుకున్నారు. అయితే సినిమా రిలీజ్ కు ముందే పైరసీ ప్రింట్ బయిటకు వచ్చేయటం భయపెట్టింది. కానీ ఆ ప్రభావం ఏమీ కలెక్షన్స్ పై పడలేదు. దాంతో టీమ్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు.


‘టాక్సీవాలా’ సినిమాకు రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. మాళవికా నాయర్‌, కళ్యాణి, ఉత్తేజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలకు ముందే అనేక అవాంతరాలను ఎదుర్కొంది. దీంతో ‘టాక్సీవాలా’ చిత్ర బృందానికి మద్దతు పలువురు సినీ తారలు ట్వీట్లు చేశారు. సినిమాను కేవలం థియేటర్‌లో మాత్రమే చూడమని కోరారు.