ఆశ్చర్యమే కానీ నిజం: పండిట్ నెహ్రు..తర్వాత అల్లు అర్జునే!


కేరళలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాల్ని దాదాపు ఆ రాష్ట్రంలో విడుదల చేస్తుంటారు. అంతేకాదు ఆ సినిమాలు మంచి టాక్‌తో.. బాక్సాఫీసు వద్ద చక్కటి కలెక్షన్స్ ను కూడా రాబడుతుంటుంది. ఇక్కడ జస్ట్ ఓకే అనుకున్న సినిమాలు కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులు బన్నీని ‘మల్లు అర్జున్‌’ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు.

అలాగే అల్లు అర్జున్ కూడా అదే స్దాయి అభిమానాన్ని కేరళవారిపై ప్రకటిస్తూంటాడు. ఆ మధ్యన ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళ ప్రజలకు అండగా నిలిచేందుకు అల్లు అర్జున్ ముందుకొచ్చి… తన వంతుగా రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.

ఇవన్నీ గుర్తించుకునే… కేరళ ప్రభుత్వం అక్కడ ఈ రోజు జరిగే 66వ నెహ్రు ట్రోఫీ బోట్ రేసులకు ముఖ్య అతిధిగా పిలిచింది. దాంతో అల్లు అర్జున్ ..హాజరైయేందుకు కేరళ వచ్చారు. 1952లో మొట్టమొదటి ఈవెంట్‌లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పాల్గొని.. విజేతలకు ట్రోఫీ అందజేశారు. ఈసారి.. తెలుగు సినిమా సెలబ్రిటీ అల్లు అర్జున్.. ముఖ్యఅతిథిగా పిలుపునందుకోవడం ఒక ఆసక్తికర అంశం.

కొచ్చి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అల్ల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు కేరళ అభిమానులు. ఆయన వస్తున్నాడు అని తెలుసుకొని పెద్ద సంఖ్యలో అభిమానులు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ఘన స్వాగతం పలికారు.

ఇక కేరళలో గత 65 ఏళ్లుగా ఈ బోట్‌ రేస్‌ పోటీలు జరుగుతున్నాయి. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట కేరళ ప్రభుత్వం ఏటా ఈ పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రెండు లక్షల మంది ఈ పోటీలు చూడటానికి తరలివస్తుంటారు. ఏడాదంతా ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండే పున్నమ్‌ద సరస్సు పోటీలు నిర్వహించే రోజున పర్యాటకులు, పోటీదారులతో సందడిగా మారుతుంది. ఎక్కువగా ఈ పోటీల్లో కుట్టనాడ్‌ జిల్లా ప్రజలు పాల్గొంటుంటారట. పోటీల్లోనూ వారే ఎక్కువగా గెలుస్తారట. అదీ విషయం.