లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్

లారీ డ్రైవ‌ర్ అన‌గానే యువ‌ర‌త్న బాల‌కృష్ణ న‌టించిన లారీ డ్రైవ‌ర్ సినిమా గుర్తుకు రావాల్సిందే. డ్రైవ‌ర్ రాముడు ఎన్టీఆర్ త‌ర్వాత బాల‌య్య‌ను డ్రైవ‌ర్ గా చూసుకునే భాగ్యం నంద‌మూరి అభిమానుల‌కు క‌లిగింది. ఇప్పుడు మెగా హీరోల‌కు కూడా అలాంటి భాగ్యం క‌ల‌గ‌నుంది. మెగా కాంపౌండ్ లోనే డ్రైవ‌ర్ పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించ‌బోతున్న హీరోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డుల‌కెక్క‌బోతున్నాడ‌ట‌.

అయితే బ‌న్ని ఎందుకు డ్రైవ‌ర్ గా మారుతున్నాడు..? ఎవ‌రి కోసం డ్రైవ‌ర్ అవుతున్నాడు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న సినిమా గురించి ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో చిత్తూరు యాస‌తో .. చిత్తూరు మ‌నుషుల‌తో తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఇందులో బ‌న్ని ర‌గ్గ్ డ్ గా ఉండే పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. అత‌డి గెట‌ప్ డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని .. లారీ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తాడ‌ని అత‌డి పాత్ర గురించి చెప్పుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ‌న్ని కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్ని ట‌చ్ చేశాడు. ఈసారి డ్రైవ‌ర్ గానూ మరో వైవిధ్య‌మైన పాత్ర‌లో చేస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.