బన్నీ ‘కనపడుట లేదు’ అంటున్న దిల్ రాజు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంకో సినిమా ఓకే చేయటమే కాదు…ఇంట్రస్టింగ్ టైటిల్ ని సైతం జనంలోకి వదిలారు. ఎమ్ సి ఎ చిత్రం దర్శకుడు శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘ఐకాన్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కనబడుటలేదు’ అన్నది ట్యాగ్ లైన్. ఈరోజు బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది..ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు పనిచేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.

మరోపక్క సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారన్న విషయం నిజమేనని ఈ సినిమా యూనిట్ పేర్కొంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందనను ఎంపిక చేశారు. ‘అల్లు అర్జున్‌ 20వ చిత్రం. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. సౌత్‌ సెన్సేషన్‌ రష్మిక మందన కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది’ అని పేర్కొంది.

ఈ ట్వీట్‌పై రష్మిక స్పందిస్తూ..‘సో.. ఎగ్జైటెడ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. బన్నీ, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ సినిమాలు వచ్చాయి.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.