`పుష్ప` కోసం బన్ని షాకింగ్ మేకోవర్
మూవీలో తన పాత్రకు అనుగుణంగా రూపాన్ని మార్చుకోవడంలో స్టైలిష్ స్టార్ ని మించిన వాడు లేడు. కెరీర్ ఆరంభం దేశముదురు, ఆర్య సిరీస్ చిత్రాల కోసం అతడు శ్రమించిన తీరుపైనా మేకవర్ పైనా ఎంతో ఆసక్తికర చర్చ సాగింది. ఇప్పటికీ ప్రతి సినిమాకి గెటప్ పరంగా వైవిధ్యం చూపించడంలో బన్నీని కొట్టేవాళ్లు లేరన్న ప్రశంసలు కురుస్తుంటాయి.
అల్లు అర్జున్ కెరీర్ ఇటీవల మరో లెవల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు పుష్ప పేరుతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని ఆసక్తిగా ఉన్నాడు. ఇక అల వైకుంఠపురములో చిత్రంలో మధ్యతరగతి యువకుడిగా అద్భుత నటనతో కట్టి పడేశాడు. ఈ మూవీలో తన పాత్ర కోసం బరువును తగ్గించుకోవాల్సి వస్తే ఎంతో శ్రమించాడు. మరోసారి అదే శ్రమ.
తాజా చిత్రం పుష్ప కోసం కూడా అతడు అదే పంథాని అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ మూవీ కోసం పూర్తిగా సన్నబడాల్సి ఉందిట. అందుకే బన్ని కరోనావైరస్ విరామ సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇంతకుముందు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రిగరస్ గా అతడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అదంతా పుష్ప కోసం ముందస్తు కసరత్తు. కేవలం ఈ మూడు నెలల గ్యాప్ లోనే పుష్ప పాత్ర కోసం ఎనిమిది కిలోలు తగ్గాడట.
అల్లు అర్జున్ తన వ్యాయామానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఇంతకుముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల బాగా బరువు తగ్గాడు. సెప్టెంబరులో పుష్ప చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నా అది కుదిరేట్టు లేదు. కరోనావైరస్ టీకా కానీ వ్యాక్సిన్ కానీ వస్తుందా? అన్న ఆశ టీమ్ లో చావడం లేదు. అలాంటిదేదైనా వస్తే కానీ.. అల్లు అర్జున్ షూటింగును తిరిగి ప్రారంభించే మానసిక స్థితిలో లేరని తెలుస్తోంది. దీనిని బట్టి పుష్ప చిత్రీకరణ వచ్చే ఏడాదికి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న సమాచారం ఉంది.