షూటింగుల అనుమతుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటపడుతూ ఉన్నారు సినీపెద్దలంతా. ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఎలాగైనా అనుమతులు తెచ్చుకుని సెట్స్ కెళ్లాలని ఆరాట పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ససేమిరా అనేస్తోంది. నెలాఖరు వరకూ స్ట్రిక్టుగానే లాక్ డౌన్ ని పాటించేందుకు కేసీఆర్ ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు పెద్ద తెర బుల్లితెర ప్రతినిధులతో మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పెద్దల్ని ఓదారుస్తున్నా ఏ ఉపయోగం ఉండడం లేదు.
అంతకంతకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి పెరుగుతోందే కానీ తరగడం లేదు. తెలంగాణలో హైదరాబాద్ లో పరిస్థితి అదుపులో ఏం లేదు. దీంతో షూటింగులకు అనుమతి ఇవ్వాలా వద్దా? అన్నదానిపై సందిగ్ధత కనిపిస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇక కరనాతో సహజీవనం చేయడం తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. ఆ క్రమంలోనే సినీ పెద్ద అల్లు అరవింద్ కేసీఆర్ – తలసాని తదితర ప్రభుత్వ పెద్దలకు ఓ కొత్త ప్రతిపాదన తెచ్చారట. పరిమితంగా అంటే 20 మంది సిబ్బందితో ఓటీటీ షూటింగులు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించారట. అరవింద్ ఇటీవలే ఆహా పేరుతో ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎలానూ పెద్ద తెర షూటింగులకు అనుమతులు లేవు. బుల్లితెర షూటింగులకు పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం తక్కువ మందితో షూటింగులకు అనుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారట. అయితే అరవింద్ కి ఒక రూలు.. ఇతర పరిశ్రమకు ఇంకో రూల్ ఉండదు. అనుమతులు ఇస్తే అందరికీ ఇస్తారు. కేవలం 20-30 తోనే షూటింగులు చేస్తామని అందరూ అడిగే అవకాశం ఉంది. అయితే బయటికి చెప్పేది ఒకటి ఉన్నా.. జరిగేది ఇంకోలా ఉంటుంది అన్న ఆందోళన ప్రబుత్వానికి ఉండి ఉండొచ్చు. మరి ఇలాంటి సమయంలో అనుమతులిస్తారా? అన్నది చూడాలి.