అల్లు అరవింద్.. భారీ పౌరాణిక చిత్రం ప్రకటన

తెలుగులో మెగా ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా వెలుగుతున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ పౌరాణిక చిత్రాన్ని చేయనున్నట్లు నేడు ప్రకటించారు. భారతీయ ఇతిహాసాలలో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.”రామాయణ” పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణ భాగస్వాములుగా కలిసి నిర్మిస్తున్నారు.

మూడు భాగాలుగా రాబోతున్న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు ఈయన. దీని కోసం 500 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్టుపై టీమ్ గత రెండేళ్లు గా పనిచేస్తోంది. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించ‌బోతున్నారు. అంతేకాదు.. సినిమా మొత్తం 3డిలోనే షూట్ చేయ‌బోతున్నారు.

మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి, ‘మామ్’ మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానున్న ఈ చిత్రం లోని నటులు, సాంకేతిక వర్గానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.