మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. పాన్ ఇండియా కేటగిరిలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలున్నాయి. బాహుబలి తర్వాత జక్కన్న తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఇందులో చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియాభట్ ని ఎంతో మంది నాయికల్ని పరిశీలించిన అనంతరం ఎంపిక చేసారు. జక్కన్న ఆహీరోయిన్ ఎంపిక చేయడానికి చాలా సమయం పట్టింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి అలియాభట్ తప్పుకుంటుందనే ప్రచారం తెర మీదకొచ్చింది.
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో షూటింగ్ లకు మినహాయింపులిచ్చారు. రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ షూటింగ్ చేసుకోవచ్చని అనుమతులిచ్చారు. అయినా భయంతో షూటింగ్ లు మొదలుపెట్టలేదు. ఇందులో ఆర్ ఆర్ ఆర్ కూడా ఉంది. ఇప్పుడీ సమస్య జక్కన్నను కంగారు లో పడేసింది. అలియాభట్ హిందీలో పలు సినిమాలకు కేటాయించిన డేట్లు ఇప్పుడు దగ్గరడటంతో ఆర్ ఆర్ ఆర్ నుంచి తప్పుకుంటానని, చెల్లించిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తానని అంటోందిట. ఇప్పటికే బాలీవుడ్ లో సైన్ చేసిన సినిమా షూటింగ్ లు ఇప్పుడు దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఔట్ డోర్ షూటింగ్ లకు సన్నద్ధం అవుతున్నారుట.
దీంతో అమ్మడు ఇప్పుడు ఓ హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితి అట. ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంటే ఆర్ ఆర్ ఆర్ కన్నా ఎక్కువ పారితోషికం నష్టపోవాల్సి ఉంటుందిట. అందుకే ఆర్ ఆర్ ఆర్ నుంచే తప్పుకోవాలని భావిస్తోందిట. ఇటీవలే ఈ విషయాలను రాజమౌళి దృష్టికి తీసుకెళ్లిందిట. కానీ ఆయన దగ్గర నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా లీకైంది. మొత్తానికి వైరస్ ప్రభావం ఆర్ ఆర్ ఆర్ పై ఇలా పడిందన్న మాట.