అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో పాట‌లు అటు బాలీవుడ్ లోనూ పాపుల‌ర‌య్యాయి. ఆ క్ర‌మంలోనే ఈ మూవీని హిందీలో నిర్మించేందుకు అల్లు అర‌వింద్ ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే హిందీలో అశ్విన్ వర్ది అనే నిర్మాత రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకున్నార‌ని స‌మాచారం.

ఇక ఇందులో టైటిల్ పాత్రకు మేకర్స్ రణవీర్ సింగ్‌ను సంప్రదించారు. కానీ ఈ మూవీని ఆయన తిరస్కరించార‌ని తెలుస్తోంది. స్వ‌త‌హాగానే ర‌ణ‌వీర్ రీమేక్ లు అంత‌గా ఇష్టపడడు. కానీ ఇంత‌కుముందు టెంప‌ర్ రీమేక్ లో న‌టించాడు. ఈసారి మాత్రం అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం చేయ‌లేన‌ని అనేశాడ‌ట‌. అయితే ఈ చిత్రం చేయడానికి చాలా ఆసక్తి ఉన్న మరో యువ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కూడా మేకర్స్ చర్చలు జరుపుతున్నారు.

అయితే ఇలాంటి ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో రణ్‌వీర్ అయితేనే బావుంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. దీంతో అత‌డికి ఎంత పారితోషికం ఇచ్చి అయినా ఒప్పించాల‌ని అతనిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ చిత్రం చేయాలా వద్దా అని రణ్‌వీర్ ఇంకా వేచి చూస్తున్నాడు. హిందీ రీమేక్ ని డైరెక్ట్ చేసేది ఎవ‌రు? అన్న‌దానిని బ‌ట్టి నిర్ణ‌యం ఉండ‌నుంద‌ట‌.