‘మ‌హాన‌టి’ సినిమాపై వాణిశ్రీ వివాదాస్పద కామెంట్

‘మ‌హాన‌టి’ సినిమాపై వాణిశ్రీ వివాదాస్పద కామెంట్

టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. అలనాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెర‌కెక్కించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యం నమోదు చేసింది. అయితే రిలీజైన ఇంతకాలం తర్వాత ఈ సినిమా గురించి సీనియ‌ర్ న‌టి వాణిశ్రీ చేసిన వ్యాఖ్య‌లు మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి.

వివ‌రాల్లోకెళ్తే ….హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాల‌తో మెప్పించిన వాణిశ్రీ కొన్నేళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈమె `ప్రేమ్‌న‌గ‌ర్` అనే సీరియ‌ల్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకురానున్నారు. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విష‌యాల‌పై ఆమె స్పందించారు. ఆ క్రమంలో `మ‌హాన‌టి` సినిమా చూశారా? అని ఆమెను అడిగితే.. విభిన్నంగా స్పందించారు.

వాణిశ్రీ మాట్లాడుతూ…నేను సినిమా రంగానికి దూరంగా ఉన్నానే కానీ.. సినిమాలు మాత్రం రెగ్యుల‌ర్‌గా చూసేదాన్ని . `మ‌హాన‌టి` సినిమా ఫ‌స్టాఫ్ త‌ర్వాత నిద్రపోయాన‌ని వ్యాఖ్య‌లు చేశారు వాణిశ్రీ. సావిత్రి లైఫ్‌లో జరిగిన విష‌యాలు త‌న‌కు సెకండాఫ్‌లో క‌న‌ప‌డ‌లేద‌ని కూడా అన్నారు.

అదే సంద‌ర్భంలో వాణిశ్రీ బ‌యోపిక్ తీసే అవకాసం ఉందా అంటే.. . జీవితంలో ట్విస్టులు, డ్రామాలు ఉన్న‌వారి బ‌యోపిక్స్‌కే ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఉంటుంద‌ని, అలాంటి ట్విస్టులు త‌న జీవితంలో లేవ‌ని ఆమె తెలియజేయ‌డం విశేషం.

ఇక గతంలోనూ వాణిశ్రీ తనకు మహానటి సావిత్రితో ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. మహానటి సావిత్రి సాదాసీదాగా ఉండేవారని, సినీ పరిశ్రమలో ఎలా ఉండాలో తనకు ఆమె నేర్పించారని, తాను సావిత్రి భక్తురాలినని, ముఖ్యంగా సావిత్రి తనకు కన్నతల్లి లాంటిదని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో దిగ్గజాలైన నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, శివాజీ గణేషణ్‌ వంటి మహామహులైన నటులతో అనేక చిత్రాలలో తాను నటించడం ద్వారా తాను మహోన్నతం గా ఎదిగానని తెలిపారు. తనకు దారి చూపిన మార్గదర్శకురాలు మహానటి సావిత్రి అయితే.. తాను మాత్రం సినీ పరిశ్రమ చెక్కిన శిల్పమని వ్యాఖ్యానించారు.