ఆడలేని ‘ఆటగాళ్లు’ (మూవీ రివ్యూ)

                                                           (సికిందర్ )

ప్రయోగాలకి ముందుండే నారా రోహిత్, పాత్రతో ఇంకో ప్రయోగం చేస్తూ, జగపతిబాబుతో ఆటగాడిగా ఈసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత తొమ్మిదేళ్లుగా ఆయనిలా ప్రయోగాలు  చేస్తూనే వున్నారు. ప్రయోగం చేస్తూ రంగప్రవేశం చేసిన ‘బాణం’ తప్ప,  ప్రయోగం చెయ్యని రోమాంటిక్ కామెడీ  ‘జ్యోఅచ్యుతానంద’ తప్ప, ఇంకో ప్రయోగం చేసిన ‘అప్పట్లో ఒకడుండే వాడు’ తప్ప, మిగతా 14 ప్రయోగాలూ గురి తప్పాయి. మరి ఆటగాడుగా ఈసారి గురి తప్పకూడదు. గురితప్పితే ఇక ప్రయోగాల ఆటకే గుడ్ బై చెప్పాలి. ఇప్పుడేం జరగవచ్చు? ఇదొకసారి చూద్దాం… 

కథ 

సినిమా డైరెక్టర్ అయిన సిద్ధార్థ (నారా రోహిత్) రోడ్డు ప్రమాదంలో అనాధ అయిన ఒకమ్మాయిని దత్తత తీసుకుంటాడు. ఇంతలో భార్య అంజలి (దర్శనా బానిక్) ని చంపాడన్న కేసులో అరెస్టవుతాడు. గతంలో గోగో (బ్రహ్మానందం) అనే ఒక కంపెనీ అధినేత తరపున మహాభారతం మూవీ ప్రాజెక్టు గురించి దర్శకుడు సిద్ధార్థని కలిసిన అంజలి, అతణ్ణి  ప్రేమించి పెళ్లి చేసుకుంది. దరిమిలా హత్యకి గురైంది. కోర్టులో ఈ హత్య కేసుని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతి బాబు) వాదించి, సిద్ధార్థ మీద  అనుమానాలు తొలగించి, బెయిల్ మీద విడుదల చేయిస్తాడు. అంజలిని మున్నా అనే కార్పెంటర్ చంపాడని అరెస్టు చేయిస్తాడు. అటు విడుదలైన సిద్ధార్థ అసలు రూపం బయట పడుతుంది. దాంతో వీరేంద్రకీ, సిద్ధార్థకీ మధ్య ఆట మొదలవుతుంది. అసలేం జరిగింది? సిద్దార్థే ఈ హత్య చేసి వీరేంద్రతో గేమ్ ఆడుతున్నాడా? అసలు అంజలి ఎందుకు హత్యకి గురైంది? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాలిక తల్లిదండ్రులతో దీనికి సంబంధ మేమిటి? ఆటలో చివరికి ఎవరు గెలిచారు? …ఇదీ కథ.


ఎలావుంది కథ

ఇది థ్రిల్లర్ జానర్ కథ. కేవలం ఒక హత్య చుట్టూ సరైన విలన్ లేకుండా బలహీనంగా అల్లిన కథ. చాలా పాత కథలాగా వుంటుంది. కానీ ఇలాటి చాలా పాత థ్రిల్లర్ కథలు కూడా ఇంత చప్పగా వుండవు. ఇందులో చెప్పుకోవడానికేమీ లేదు. హత్య కేసులో చట్టాన్ని ఏమార్చి బయట పడ్డ హీరో కథ కుండాల్సిన బిగి, వేగం, సస్పెన్స్, థ్రిల్, టెంపో, యాక్షన్ ఏవీ లేకుండా ఒట్టి డైలాగులతో నడిచే కథ. అసలు కథకుడు థ్రిల్లర్ కథ ఎలా వుండాలో తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు పేజీలు  (డైలాగులు) నింపేసిన  బి – గ్రేడ్ కథ. దర్శకుడి ట్రాక్ రికార్డు చూస్తే గతంలో థ్రిల్లర్స్ తీసిన అనుభవం లేదు. తనకి  తెలిసిన జానర్స్ లవ్, మూస ఫార్ములా యాక్షన్లు మాత్రమే. ఆ ధోరణుల్లో ఈ కథ చేయడం  దుస్సాహసమే.  


ఎవరెలా చేశారు

ఎవరేం చేస్తారు? ఏమీ చేయలేరు. చేయడానికేమీ లేదు. తన పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నారా రోహిత్, ఇందులో కూడా యాంటీ హీరో పాత్ర భలే వుందే అని ఒప్పేసుకుని తప్పులో కాలేసి కూర్చున్నారు. పాత్ర భలేగా వుంటే సరా? మిగతా పాత్ర చిత్రణలు, కథా కథనాలూ భలే భలేగా వుండనవసరం లేదా? ఎదుటి పాత్రలో జగపతి బాబు లాంటి సీనియర్ వుంటే సరా? ఇద్దరి పాత్రలు చేసే పనేమిటని చూసుకోనక్కర్లేదా? ఫస్టాఫ్ బ్రహ్మానందంతో హైదరాబాద్ నుంచీ ఆంధ్రా దాకా, హీరోయిన్ తో కార్లో పోతూ చేసిన కామెడీ పూర్తిగా కాలం చెల్లిన, నవ్వురాని బోరు అని తెలుసుకోకపోవడం నారావారి లోపం కాదా? తన అభిమానుల్ని పనిగట్టుకుని ఏడ్పించడం కాదా? ఎందుకీ సినిమా చేసినట్టు?

          ఇక జగపతి బాబు. ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రలాంటిదేనా అది? అయితే కుదరలేదు. ఆఫ్టరాల్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీఎంని ధిక్కరిస్తూ మాట్లాడి, ఆయన నోర్మూయించి వెళ్ళేది కూడా ఒక పాత్రచిత్రణేనా? ఏ, బి సెంటర్స్ కాదు, సీ సెంటర్స్ లోనైనా ప్రేక్షకులు ఇలాటివి చూడగల్గాలా వద్దా? 

          బ్రహ్మానందం, ఇంకొద్దురా బాబూ నాకు కామెడీ అని తన మానాన తనుంటే బలవంతంగా తెచ్చి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇది ప్రేక్షకులతో సంబంధం లేని దర్శకుడి టేస్టుకి సంబంధించిన విషయం. హీరోయిన్ అయితే చెప్పనక్కర్లేదు. పాత్రకి తగ్గట్టే గ్లామరుతో వుంది.

 
          సంగీతం, ఛాయాగ్రహణం, పోరాటాలూ పాత స్టయిల్లో వున్నాయో లేక, విషయం లేని  సినిమావల్ల, దర్శకత్వం వల్ల, అలా అన్పిస్తున్నాయో చెప్పడం కష్టం. 


చివరి కేమిటి?

2002 లో ‘నీ స్నేహం’ అనే హిందీ రీమేక్ తో దర్శకుడుగా పరిచయమైన పరుచూరి మురళి వరసగా ఆంధ్రుడు, రెచ్చిపో, పెదబాబు, అధినాయకుడు అనే కమర్షియల్ మాస్ సినిమాలు తీశారు. ఈసారి థ్రిల్లర్ కి కేటాయించుకున్నారు. కానీ మొదటి ప్రేమునుంచీ చివరిదాకా, ఎక్కడా  చిత్రీకరణ ఒక థ్రిల్లర్ చూస్తున్నట్టు వైవిధ్యంతో వుండదు. చాలా పూర్ గా, పాత మూస ఫార్ములా చూస్తున్నట్టు ఇబ్బంది పెడుతుంది. కథా కథనాలు, పాత్రలూ సరే. వీటిని కూడా కాలం చెల్లిన మూస ఫార్ములా చట్రంలో బిగించేసి ప్రాణం తీశారు. ఇద్దరు ప్రముఖ స్టార్స్ వుండీ వచ్చిన అవకాశాన్ని కేవలం ప్రేక్షకులకి దూరమై పోయిన తన పాత టేస్టు కారణంగా వృధా చేసుకున్నారు. ఒక వయసు మీద పడిన ప్రయత్నాన్ని భారంగా మోసినట్టుంది. ఆయన కెరీర్ లోనే అడుగంటిన క్రియేటివిటీ ఇది. ఈ సినిమాని  ప్రేక్షకులు ఎందుకు చూడాలి? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పుకోగల్గితే, ఈ ప్రయత్నమే చేసివుండే వారు కాదు. ‘ఆటగాళ్ళు’ నూట ఇరవై నిమిషాల సహన పరీక్ష. ప్రయోగాలకి నారా రోహిత్ తో సహకరించని మరో తండ్లాట!

 

‘ఆటగాళ్ళు’ 
రచన – దర్శకత్వం
 : పరుచూరి మురళి
తారాగణం
  : నారా రోహిత్జగపతి బాబుదర్శనా బానిక్బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు 
సంగీతం
 : సాయి కార్తీక్,  ఛాయాగ్రహణం : విజయ్ సి కుమార్ 
నిర్మాత     : వాసిరెడ్డి రవీంద్రనాథ్వాసిరెడ్డి శివాజీ ప్రసాద్మక్కెన రామువడ్లపూడి జితేంద్ర
విడుదల : ఆగస్టు 24
, 2018

***
మా రేటింగ్ 1.5 / 5
***