2020లో ప్రేక్షకుల్ని, టాలీవుడ్‌ని ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాల పైనా చాలా ఆశలు పెట్టుకున్నారు ఇటు ప్రేక్షకులు అటు నిర్మాతలు. ముఖ్యంగా ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఒకటి సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు సినిమాల బిజినెస్ రమారమీ 300 కోట్ల వరకూ ఉండొచ్చు. వీటిలో ఏ ఒక్క హిట్టు తగిలినా 2020కి బంపర్ ఓపెనింగ్ రావడం ఖాయం. ఇక దర్బార్, ఎంత మంచి వాడవురా కూడా హిట్టు లక్షణాలతోనే వస్తున్నాయి. రజనీ – మురుగదాస్ కాంబినేషన్ అంటేనే ‘ఒక్కసారి ఈ సినిమా చూడాల్సిందే’ అనుకుంటారు జనాలు. అదే ఈ సినిమాకి ప్రధానమైన సేలింగ్ పాయింట్. సంక్రాంతి సీజన్‌కి తగిన సినిమా ‘ఎంత మంచివాడవురా’. పేరుకు తగ్గట్టు మంచితనం మేళవిస్తే… మంచి ఫలితాన్నే అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ యేడాది అందరి దృష్టీ ‘ఆర్.ఆర్.ఆర్’పై ఉండడం ఖాయం.
ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలసి నటిస్తున్న చిత్రమిది. రాజమౌళి దర్శకుడు. దేశం మొత్తం ఈ సినిమా వైపు చూడడంలో ఆశ్చర్యం ఏముంది? 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇప్పటి వరకూ ఒక్క లుక్ కూడా విడుదల కాలేదు. అయినా సరే.. ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అదీ రాజమౌళి మ్యాజిక్. ఇదీ ఈ యేడాదే విడుదల కానుంది. అంటే.. మరిన్ని రికార్డు బ్రేకింగులు ఈ యేడాది చూడొచ్చన్నమాట.
విజయ్ దేవరకొండ- పూరిల క్రేజీ కాంబినేషన్ ‘ఫైటర్’ ఈ యేడాదే పట్టాలెక్కుతుంది. ఇదే ఏడాది విడుదల అవుతుంది. పూరి ఏ క్షణంలో ఎలాంటి హిట్టు ఇవ్వగలడో ఎవరూ చెప్పలేరు. పైగా విజయ్‌తో సినిమా. నిలబడిందంటే.. మరో వంద కోట్లు కొట్టడం ఖాయం. చిరంజీవి – కొరటాల కాంబినేషన్‌లో ఓ చిత్రం ఈనెలలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. 2020 దసరాకి విడుదల చేసే అవకాశం ఉంది. అదీ క్రేజీ ప్రాజెక్టే.
ప్రభాస్ ‘జాన్’ కూడా ప్రభంజనాలు సృష్టించే సత్తా ఉన్న సినిమానే. `సాహో`లో తప్పిన లెక్కలన్నీ దీంతో సవరిద్దామనుకుంటున్నాడు ప్రభాస్. ఇది కూడా పాన్ ఇండియా ఇమేజ్ తోనే విడుదల అవుతుంది. పవన్ కల్యాణ్ ‘పింక్’, బాలయ్య – బోయపాటి సినిమా, రవితేజ డిస్కోరాజా… ఇలా ఈ ఏడాదిలో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్టులకైతే లెక్కే లేదు. వీటిపై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటిలో సగం ఆడినా సరే – ఈ ఏడాది బాక్సులు బద్దలు అవ్వడం ఖాయం.