నటీనటులు: విశ్వక్‌సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భానుచందర్, హరితేజ తదితరులు నటించారు.
దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫి: మణికందన్
ఎడిటర్ : గ‌్యారీ బీహెచ్
ప్రొడక్షన్ కంపనీ: వాల్‌పోస్టర్ సినిమా
రిలీజ్ డేట్ : 28-02-2020
రేటింగ్ : 2.75
కొత్త తరహా చిత్రాల్ని నిర్మించాలని, కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో నాని ప్రారంభించిన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా. ఈ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం `అ!`. ప్రశాంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి విజయాన్ని అందించింది. ఇదే సంస్థ నుంచి వచ్చిన రెండవ చిత్రం `హిట్`. `ఫలక్‌నుమాదాస్` చిత్రంతో పాపులర్ అయిన విశ్వక్‌సేన్ ఇందులో హీరోగా నటించారు. గౌతమ్ మీనన్ చిత్రాల తరహా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా కొత్త దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొత్త తరహా చిత్రాలని అందించాలని నాని చేసిన ప్రయత్నం ఎంత వరకు ఫలించింది?. విశ్వక్‌సేన్ ఆకట్టుకున్నాడా?.. దర్శకుడు శైలేష్ కొలను నాని నమ్మకాన్ని నిలబెట్టాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
విక్రమ్ రుద్రరాజు (విశ్వక్‌సేన్) పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. అతన్ని గతం వెంటాడుతూ మానసిక సంఘర్షణకు గురిచేస్తూ వుంటుంది. మానసికంగా బాధపడుతున్న విక్రమ్‌కు ప్రీతి మిస్సింగ్ కేస్ సవాల్‌గా మారుతుంది. ఇంతకు ముందు ప్రీతి కేస్‌ని డీల్ చేసిన ఆఫీసర్ పరిస్థితి సరిగా లేకపోవడం, అదే సమయంలో విక్రమ్ రుద్రరాజు సహచర పోలీస్ అదికారిని నేహా (రుహానీశర్మ) కూడా కనిపించకుండా పోవడంతో అంతా విక్రమ్‌ని అనుమానించడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన విక్రమ్ రుద్రరాజు ప్రీతీ, నేహాల మిస్సింగ్‌పై ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో విక్రమ్ ఎలాంటి సవాళ్లని ఎదుర్కొన్నాడు?..ప్రీతీ, నేహాల మిస్సింగ్ వెనకున్న అసలు రహస్యం ఏమిటి? దాని వెనక ఎవరున్నారు? .. ఈ కేస్‌ని విక్రమ్ ఏవిధంగా పరిష్కరించాడు?.. విక్రమ్‌నే డిపార్ట్‌మెంట్ ఎందుకు అనుమానించింది అన్నది అసలు స్టోరీ.
నటీనటుల నటన:
`ఫలక్‌నుమాదాస్`లో వన్ మేన్ ఆర్మీగా తన పాత్రని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న విశ్వక్‌సేన్ ఈ చిత్రంలోనూ విక్రమ్ రుద్రరాజు పాత్రని కూడా అదే స్థాయిలో రక్తికట్టించాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో వావ్ అనిపించాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విశ్వక్‌సేన్ నటన నేచురల్‌గా అత్యంత సహజసిద్ధంగా సాగింది. అంత బాగా ఆ పాత్రని చేశాడు. సీరియస్ లుక్‌తో సైలెంట్‌గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. అతనిలోని కొత్త యాంగిల్‌ని ఈ సినిమా ద్వారా దర్శకుడు శైలేష్ కొలను బయటి తీశాడని చెప్పొచ్చు. `చిలసౌ` చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహానీ శర్మ తన పాత్ర పరిధిమేరకు నటించింది. విశ్వక్‌సేన్, రుహానీ శర్మ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా వుంది. మిగతా పాత్రల్లో భానుచందర్, మురళిశర్మ, హరితేజ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రధానంగా ఆకట్టుకునే అంశాలు ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం. ఈ రెండు చాలా ముఖ్యం. ఈ సినిమా విషయంలోనూ అవే ప్రధాన హైలైట్‌లుగా నిలిచాయి. డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి తనదైన లెన్సింగ్‌తో సినిమాటోగ్రాఫర్ మణికందన్ కొత్త లుక్‌ని తీసుకొచ్చాడు. విజువల్స్ పరంగా ఆ మూడ్‌ని కంటిన్యూ చేయడంలో మణికందన్ వర్క్ సూపర్. ఇక అతని విజుల్స్‌కి తన నేపథ్య సంగీతంలో మరింత పట్టునిచ్చాడు వివేక్ సాగర్. ఈ విషయంలో ఇద్దరు పోటీపడ్డారేమో అనిపిస్తుంది. పేరుకు ఇది చిన్న సినిమాను అయినా క్వాలిటీ విషయంలో హీరో నాని ఏ మాత్రం రాజీపడలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతీ విజువల్ ఓ బిగ్ ఫిల్మ్ స్టాండర్డ్స్‌లో వున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగిన ఈ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ తొలిభాగాన్ని బాగానే కట్ చేసినా సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొంత ఆ పేస్‌ని మిస్సయినట్టు కనిపిస్తుంది. ఇక మిగతా వారంతా తమ తమ పరిథి మేరకు బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించారు.
విశ్లేషణ:
దర్శకుడు చిన్న పాయింట్‌ని తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఇంట్రెస్టింగ్ నడిపించాడు. అయితే బలమైనపాయింట్‌ని తీసుకుని వుంటే ఫలితం మరింత మెరుగ్గా వుండేది. విశ్వక్‌సేన్ పాత్రతో ఆకట్టుకోవాలని కొత్తగా ప్రయత్నించాడు. అయితే ఆ పాత్ర పడే మానసిక సంఘర్షణని, మిస్సింగ్ కేస్‌ల వెనకున్న బలమైన రీజన్‌ని మాత్రం మరింత బలంగా చూపించలేకపోయాడు. ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే నాని పెట్టుకున్న నమ్మకానికి నూటికి నూరు శాతం న్యాయం చేసినట్టయ్యేది. సెకండ్ హాఫ్‌లో డ్రాగ్ లేకుండా చూసుకోవాల్సింది. తొలి సినిమా అయినా దర్శకుడు శైలేష్ కొలను ఓ అనుభవం వున్న వాడిలా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇవన్నీపక్కన పెడితే ఓ ఇంటెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు `హిట్` పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.