‘సైరా’ వివాదం, కేటీఆర్ దగ్గరకు పంచాయితీ?

కేటీఆర్ అండతో సైరా వివాదం తీరనుందా?

రామ్ చరణ్ కు, కేటీఆర్ కు ఉన్న స్నేహం సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సైరా వివాదం పంచాయితీ కేటీఆర్ దగ్గరకు చేరిందని సమాచారం. దాంతో ఈ వివాదాన్ని తాను పరిష్కరిస్తానని కేటీఆర్ మెగా క్యాంప్ కు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అటు వైపు వాదన కూడా విని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటానని, ఇరు వైపులా న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కనుక ఈ వివాదాన్ని పరిష్కింపదలిస్తే …కొన్ని గంటల్లోనే సమిసిపోతుందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

ఇక వివాద విషయానికి వస్తే…ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బంధువులుకు మెగా క్యాంప్ కు మధ్య గత కొద్ది రోజులు గా వివాదం జరుగుతోంది. సినిమా స్టోరీ కోసం తమ దగ్గరనుంచి అన్ని ఆధారాలు తీసుకుని.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రీసెంట్ గా రామ్ చరణ్, చిరంజీవిలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 22 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించి.. సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో వీరికి న్యాయం చేస్తామని డైరెక్టర్, ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారు. సినిమా షూటింగ్ కోసం వారి స్థలాలను, ఆస్తులను వాడుకున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు చిత్రయూనిట్ ని కలిశామని.. చివరికి న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 5వ తరం వారసులైన దస్తగిరి రెడ్డి, లక్ష్మీ చెబుతున్నారు.

చట్టపరంగా 23 మందికి రూ. 50 కోట్లు, కథ చెప్పినందుకు రూ.2 కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ తీసుకుని ఇప్పుడు చిత్రయూనిట్ మోసం చేసిందని బాధితులు వాపోతున్నారు.మరి ఈ వివాదాన్ని కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారో తెలియాల్సి ఉంది. అంత పెద్ద మొత్తం ఇవ్వటానికి మాత్రం రామ్ చరణ్ సిద్దంగా లేరు అని తేలిపోయింది.