మెగాస్టార్ చిరంజీవి చైర్మన్‌గా ఏర్పాటు చేసిన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ)కి ఇప్పటి వరకు 6 కోట్లకు మించి విరాళాలు అందాయి. చిరు, నాగ్, ప్రభాస్, రామ్‌చరణ్, మహేష్, ఎన్టీఆర్, దగ్గుబాటి ఫ్యామిలీ.. ఇలా ఎవరికి తోచింది వారు కార్మికుల సహాయార్థం విరాళాలు అందించారు. డబ్బులైతే ఊహించిన స్థాయిలో వచ్చిపడ్డాయి. అయితే దీన్ని కార్మికులకు చేరవేయడమే చిరు అండ్ తమ్మారెడ్డి టీమ్‌కు సంకటంగా మారింది.
కార్మికులకు బియ్యం, గ్రాసరీస్, కొంత నగదుని అందించాలని కమిటీ నిర్ణయించింది. దీనికి ప్లేస్‌లని కూడా నిర్ణయించారు. రామానాయుడు స్టూడియోస్. అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎకర్స్, చిత్రపురి కాలనీ. ఈ మూడు ఏరియాల్లో సినీ కార్మికులకు సీసీసీ ద్వారా ఇవ్వాలనుకున్న వాటిని అందించాలని నిర్ణయించారు. బుధ, గురువారాల్లో కొత్తగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బయటపడటంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దంతో సీసీసీ తలపెట్టిన కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ఒకే దగ్గర కార్మికులంతా గుమిగూడితే ప్రమాదమని, అలాంటి అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వరాదని ఆర్డర్స్ వున్నందున పోలీసులు పర్మీషన్ నిరాకరించారట. దీంతో ఏం చేయాలో అర్థంకాని సీసీసీ సభ్యులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు.
విరాళాల ద్వారా కార్మికుల క్షేమం కోరుతూ స్టార్స్ అందించిన మొత్తాన్ని కార్మికులకు నేరుగా అందిస్తే బాగుంటుంది. ఈ ఆపత్కాలంలో డబ్బులతో ఆదుకున్నారని అంతా భావిస్తారు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులందరిని ఒక చోట చేర్చి ఇవ్వాలనుకున్న మొత్తాన్ని అందించడం కష్టం, పోలీసులు కూడా ఇందుకు అంగీకరించరని భావించి కార్మికుల అకౌంట్‌లోకే నేరుగా ఇవ్వాలనుకున్న మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం మొదలుపెట్టారు. గత గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్ ప్రారంభించారు.
గురువారం ఉదయం నుంచే కార్మికుల అకౌంట్ నంబర్‌లని ఆయా కార్మిక సంఘాల అధ్యక్షుల ద్వారా కలెక్ట్ చేసిన సీసీసీ సభ్యులు కార్మికుల అకౌంట్‌లోకే నిర్ణయించిన మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో వీలైనంత వరకు కార్మికుల అకౌంట్‌లకు డబ్బు చేరబోతోంది.